స్వరూపం. ఇవి మూడూ గదా ఇంతవరకూ వర్ణించిన విషయాలు. అంటే అప్పటికి క్షేత్రం - క్షేత్రజ్ఞుడూ - క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకొనే జ్ఞానం ఇవేనన్న మాట ఉన్న విషయమంతా. ఇవి మూడూ ఇంతవరకూ వేరు వేరుగా వర్ణించినట్టు కనిపిస్తున్నది మహర్షి. కాని అలా వేరుగా పేర్కొన్నా నిజానికి వేరు గావవి. మూడూ కలిసి ఒక్కటే. సమాసతః అనే మాటలో సూచన చేస్తున్నాడా రహస్యమాయన. సమాసమంటే ఇక్కడ సంగ్రహంగా నని కాదు. మూడూ కలిసి ఒక్కటేనని. ఎలాగ. క్షేత్రజ్ఞుడని పేర్కొన్న ఆత్మ మాత్రమే ఉన్న పదార్ధమసలు. అదే సర్వక్షేత్రాలలో ఉందని ముందే చెప్పాడు. కాబట్టి ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడని మనం భావించే జీవుడనే వాడెగిరి పోయాడు. పోతే ఇక సకల శరీరాలూ వ్యాపించిన ఈశ్వరుడొకడూ క్షేత్రమని పేర్కొన్న విశ్వ శరీర మొకటీ రెండు మిగిలిపోయాయి. అంటే సమష్టి రూపమైన క్షేత్రం. సమష్టి రూపుడైన క్షేత్రజ్ఞుడు. ఇందులో క్షేత్రజ్ఞుడి తాలూకు విభూతే క్షేత్రమని వర్ణించటం మూలాన ఈశ్వర చైతన్యాని కంటే వేరుగా ప్రపంచమనే క్షేత్రం వాస్తవంగా లేదని తేలిపోయింది. పోతే అప్పటికి క్షేత్రజ్ఞుడని చెప్పే ఈశ్వర చైతన్యమే ఉన్న పదార్ధమని చెప్పినట్టయింది. అయితే జ్ఞానమని మరొక మూడవది పేర్కొన్నాడే అదేమిటి. అదేదో గాదు. నేనీ పరిమితమైన శరీరం మేరకే ఉన్నానని భావించే జీవుడు వాస్తవంలో నేను పరిచ్చిన్నుడను కాను పరిపూర్ణంగా