#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ఇహపర చింతా లేదు. పూర్వజన్మ పునర్జన్మాది చింత అంతకన్నా లేదు. అసలు చింత అనేదే లేదు. అంతా నిశ్చింతే.

  ఇలాటి నిశ్చింతమైన పరిపూర్ణ దివ్య జీవన సుఖాన్ని మానవజాతికి ప్రసాదించటమే భగవద్గీతా ప్రబోధ సర్వస్వం. అది అప్పుడెప్పుడో విషాద గ్రస్తుడైన అర్జునుడికి కృష్ణభగవానుడు నూరిపోశాడో లేదో మనకు తెలియదు గాని ఆయన గారి ప్రతినిధి కృష్ణ ద్వైపాయనుడు మాత్రం అటు ద్వాపరానికి ఇటు కలియుగానికీ మధ్యలో నిలబడి అన్ని తరాల వారికీ ముక్త కంఠంతో చాటి చెబుతున్న గొప్ప రాజ రహస్యం. రహస్యం కాదిది మామూలు మాట అని ఎక్కడ తేలికగా చూస్తామోనని అడుగడుగుకూ గుహ్యం గోప్యమని మనకు గుర్తు చేస్తూనే వస్తాడీ రాజగుహ్యాన్ని మనకు. తనివి తీరక పునరుక్తి అని కూడా చూడక ఒకే ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని పద్దెనిమిది అధ్యాయాల దాకా పెంచి పొడిగించి సాగదీసి నూరిపోశాడు మనకు. ఇంకా మనకు జిడ్డు వదలకపోతే మనం మహా బధిరులమూ జాత్యంధులమూ అనిపించుకోవలసి ఉంటుంది.

  అలాటి బుద్ధిహీనులం కాదు మేము వివేకవంతులమే విచార దక్షులమే నని ఆత్మ విశ్వాసముంటే మాత్రమా వ్యాన ప్రోక్తమైన గీతా వాణి నామూలాగ్రమూ పరిశీలించండి. శ్రవణ మనన నిదిధ్యాస నలు చక్కగా సాగించండి. అందులో ఏముందో నిక్షేప మెంత ఉందో పట్టుకోట మెలాగా అని సంకోచిస్తున్నారా. అయితే మీకోసం బాగా పరిశ్రమించి దాని లోతు తడవి చూచి యధాశక్తిగా దాన్ని బయటికి తీసి మీకు నిష్కామ కర్మగా అందజేస్తున్న మాబోటి అధ్యాత్మ విద్యా క్షేత్ర కృషీవలులను నమ్మండి. మాకృషి ఫలాన్ని అందుకొని ఆస్వాదించండి. మేమెలాగూ అనుభవిస్తూనే ఉంటాము. మీరూ మా అనుభవంలో పాలుపంచుకొంటే మాకానందం. సూర్యుడు తాను ప్రకాశిస్తూనే మిగతా పదార్ధాలను ప్రకాశింప జేస్తుంటాడు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు