ఎటు వచ్చీ దీన్ని బాగా భావన చేసి మన సొమ్ము చేసుకోవటమే మనమందరమూ చేయవలసిన పని. అది కూడా బాహ్యమైన సామగ్రి నేదో పోగు చేసుకోటం లేదు. శారీరకంగా వాచికంగా శ్రమపడ నక్కర లేదు. కేవలం మానసికంగా దృష్టి మార్చుకొని చూడటమే. అంతకన్నా ఏలాటి ప్రయత్నమూ లేదు. ప్రత్యభిజ్ఞే Realisation ప్రయత్నమంతా - సర్పదృష్టితో చూస్తే మనకింత వరకూ సర్పమే కనిపించింది. రజ్జువనే దక్కడే ఉన్నా కనిపించలేదు. ఎప్పుడైతే సర్పదృష్టి రజ్జు దృష్టిగా మార్చుకొని చూచామో అప్పుడా సర్పమే రజ్జువుగా మనకనుభవానికి వస్తుందా లేదా. అలాగే ఇంత వరకూ నామరూపాత్మకంగా చూస్తూ వచ్చామీ చుట్టూ ఉన్న పదార్థాన్ని మనం. అదే ఇప్పుడు అస్తి భాతి అని ప్రతి ఒక్కటీ ఆ రూపంగా చూస్తూ పోతా మనుకోండి. నిజానికిది అస్తిభాతియే గదా. అంచేత ఆ దృష్టి కస్తి భాతి గానే అనుభవానికి రావటంలో అభ్యంతర మేముంది. ఆశ్చర్య మేముంది.
ఎంత సులభంగా తేల్చి పారేసిందో చూడండి గీత. భగవద్గీత దృష్టిలో సమస్యా లేదసలు. పరిష్కార ప్రయత్నమూ లేదు. అవి రెండూ లేకపోతే కొత్తగా మనం చేయవలసిన పరిష్కారమూ లేదు. అంతా ఆభాసే. ఆభాస ఎప్పుడూ వస్తువు నాశ్రయించే ఉంటుంది. ఆ వస్తువేదో గాదు. మనమే మన స్వరూపమే. నేననే జ్ఞానమే. జ్ఞానం వరకూ వస్తువైతే దాని ఆలోచనల దగ్గరి నుంచీ బాహ్యమైన ప్రపంచం వరకూ అంత దాని ప్రసరణే. అదే ప్రసరిస్తున్న దది నేనే నని భావిస్తే చాలు. అంతా నా ప్రసరణా నావిభూతే. నేనే.
ఇలాటి అఖండాత్మ భావన ఏమరకుండా నిరంతరమూ ఆ భావనతో భావితం చేసుకో నీ మనస్సు. అది మనస్సు కాదప్పు డాత్మ. జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యమంతా దాని స్వరూపమే. అది నీనా స్వరూపమే. ఇది ఆరూఢమైతే మానవుడి కిక జనన మరణచింతా లేదు. సుఖదుఃఖాది సంసార చింతా లేదు.