ముఖావలోకనము
మన భగవద్గీతా సర్వస్వంలో ఇది మూడవ షట్కం. దీనితో ఆఖరు మన ప్రయాణం. ఇంతకు ముందు రెండు షట్కాలకూ వ్రాసే ఉన్నాను ఉపోద్ఘాతం. అలాగే దీనికీ వ్రాయవలసి ఉంది న్యాయమైతే. కాని అంతకన్నా కొత్తగా చెప్పవలసిందేముందా అని ఆలోచన. మహా అయితే తత్త్వమసి వాక్యంలో అసి అనే మూడవ మాటను గూర్చిన విచారణ ఇక్కడ జరిగిందని వ్రాయాలి. అసి అంటే జీవేశ్వరైక్యాన్ని బోధించే మాట. దానితో వాక్యార్ధం సమాప్త మవుతుంది.
కాని వాక్యార్థంతో సమసిపోదు మన విజ్ఞాన యాత్ర. అది కేవలం పరోక్షమైన సిద్ధాంత జ్ఞానమే. సిద్ధాంతం దృష్టాంత మయినప్పుడే పరోక్ష మపరోక్షంగా మానవుడి అనుభవానికి వచ్చేది. అనుభవమే గదా గమ్యం ప్రయాణానికి. అంచేత అలాటి అనుభవం మనకీ భగవద్గీత అందిస్తున్నదా లేదా అందిస్తే అది ఎలా అందిస్తున్నదని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పుకోవాలి మనం.
ఎంతో దూరం పోనక్కర లేదు మనమీ విషయంలో. మరి ఏ గ్రంథమూ ఇవ్వలేని హామీ మనకు భగవద్గీత అద్భుతంగా ఇచ్చిందది. రాజ విద్యా యోగంలో ఒక్క వాక్యం చాలు. అది బంగారం. ప్రత్యక్షావగమం - సుసుఖం కర్తుం - ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికీ నిత్యమూ కనిపిస్తూనే ఉంది పరమాత్మ తత్త్వం. దాన్ని పట్టుకోటం కూడా నీ మనస్సు కంత సులభమే. ఇక అది ఎక్కడో ఉంది దాన్ని ఎలాగా అందుకోటమని దేనికి నీకు తాపత్రయమని ఘంటాపధంగా చాటుతున్నదీ ప్రపంచాని కంతటికీ భగవద్గీత. ఇంతకన్నా సిద్ధాంతమే ముందిక దృష్టాంత మేముంది.