ఇంకా వర్ణిస్తూ పోతున్నాడా తత్త్వాన్ని గీతాచార్యుడు. ఆత్మ అనేది ఏకం. అద్వితీయం. ఎంచేతనంటే సామాన్యరూపంగా సర్వత్ర పరుచుకొని ఉందది. అలా వ్యాపిస్తే అది నిరాకారమూ నిశ్చలమూ కాక తప్పదు. అలాంటప్పుడది విభక్తమెలా అవుతుంది. సాకారమైన పదార్ధమైతే దాన్ని విభజించవచ్చుగాని నిరాకార మన్నప్పుడు విభాగాని కవకాశమేది. అందుకే అది అవిభక్తంచ. విభక్తం కాదు. ప్రతి శరీరంలో ఆకాశంలాగా వ్యాపించి అహంతా రూపంగా స్ఫురిస్తున్న చైతన్యమది. కాని భూతేషు విభక్తమివచ స్థితం. ప్రాణులందరిలో అలా వ్యాపించి కూడా ఎక్కడికక్కడ విభక్తమయినట్టు భ్రమ గొలుపుతున్నది. కారణం. దేహేష్వేవ విభావ్య మానత్వాత్తంటారు ఆచార్యుల వారు. పాత్రలలో జలంలాగా ఆయా దేహాలలోనే నేననే భావంతో విభక్తమయి కనిపిస్తున్నది కాబట్టి.
అంతేకాదు. భూత భర్తృచ తద్ జ్ఞేయం - గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. ఇంతకు ముందేమని చెప్పాడు. సమస్త భూతాలూ అదేనని గదా చెప్పాడు. ఇప్పుడే మంటున్నాడో చూచారా. భూత భర్తృ. సమస్త భూతాలనూ అదే భరిస్తున్నది. తనలో నిలుపుకొంటున్నది. గ్రసిష్టు. తనలో పూర్తిగా లయం చేస్తున్నది. ప్రభవిష్ణుచ. అంతేగాక వాటిని సృష్టిస్తూ కూడా ఉన్నదంటాడు. అంటే అర్థం. సమస్త ప్రపంచాన్ని అదే సృష్టిస్తున్నది. పోషిస్తున్నది. లయం చేస్తున్నది. సృష్టి స్థితి లయాలు చేసేది ఆ సృష్టి అయ్యే పదార్ధాలెలా కాగలదు.