చూచినా దాన్నే మనకు బయటపెడుతుంది. దాని ఆచూకీయే పట్టి ఇస్తుంది మనకు.
అదే వర్ణిస్తున్నాడిప్పుడు. బహిరంతశ్చ భూతానాం. భూతమంటే అది ప్రాణమున్నది గావచ్చు. లేని జడపదార్ధం కావచ్చు. జడ చేతనాలనే తేడా లేకుండా ప్రతి పదార్థం లోపలా వెలపలా వ్యాపించి ఉందది. ఆయా పదార్ధాలు విశేషాలైతే అది సామాన్యం. విశేషాలు సామాన్యాన్ని వ్యాపించలేవు. అసలొక విశేషం మరొక విశేషాన్నే వ్యాపించలేదు. కాని చిత్రమేమంటే అన్ని విశేషాలనూ కలిపి సామాన్యం వ్యాపిస్తుంది. తరంగం తరంగాన్ని వ్యాపించకున్నా అన్ని తరంగాలనూ జలం వ్యాపించటం లేదా. అలాగే. ఏమిటది. సచ్చిద్రూపమైన ఆత్మ. ప్రతి ఒక్కటీ ఉందని చూస్తున్నావా లేదా. అదే సద్రూపమైన వ్యాప్తి. ప్రతిదీ ఉన్నట్టు స్ఫురిస్తున్నదా లేదా. అదే చిద్రూపమైన వ్యాప్తి. దీనికే అధిష్ఠానమని మరొక పేరు. అధిష్ఠాన మాత్మ అయితే దానిమీద ఆరోపితమైనవే ఈ చరాచర పదార్ధాలు. ఇవి ఏవో గావు మరలా. అధిష్ఠానమే ఆరోపిత పదార్ధాల రూపంగా భాసిస్తున్నది. అందుకే అచరమూ చరమూ రెండూ అదేనంటున్నాడు. అచరం చరమే వచ. కదిలేదీ అదే కదలనిదీ అదే.
మరి చరాచర పదార్ధాలన్నీ అదే అయినప్పుడా క్షేత్రజ్ఞుడెందుకు మరుగుపడినట్టు. ఇదుగో ఇదే క్షేత్రజ్ఞుడని సర్వులూ చూడగానే