#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  సర్వేంద్రియ వివర్జితం. మొత్తాని కది సర్వేంద్రియ రహితమైన తత్త్వమే అయినా సర్వేంద్రియాలూ దాని ఆభాసే గనుక దానినే మనకు పట్టి ఇస్తాయి. అసక్తం సర్వభృచ్చెవ. స్వరూపతః అది అసక్తమే. దేనితో సంబంధం లేదు దానికి. అది తప్ప మరేదైనా ఉంటే గదా సంబంధమనేది ఏర్పడటానికి. కాని వాస్తవంగా ఏదీ లేకపోయినా ఆభాసగా ఉంది కాబట్టి సర్వపదార్ధాల రూపంగా అదే కనిపిస్తూ అదే వాటిని తనలో భరించి ఉంది. మిధ్యా జగదధిష్ఠానా అన్నట్టు అసత్యానికి సత్యమే ఆధారం. భగవత్పాదులు వివరిస్తున్నారు వినండి. సదాస్పదంహి సర్వం సర్వత్ర సద్బుద్ధ్యను గమాత్. నహిమృగ తృష్టి కాదయోపి నిరాస్పదా భవంతి. ఉన్న పదార్ధమే లేని వాటన్నిటికీ ఆశ్రయం. ఎండమావుల జలం లేనిదే కావచ్చు. కాని అక్కడ జలం కనపడుతున్నదంటే ఏమిటి దాని కాధారం. ఉన్న సూర్యరశ్మే గదా. రశ్మి అనే ఆశ్రయం లేకుండా జలమెక్కడ కనిపించగలదు నీకు. అలాగే ప్రతిదీ లోకంలో ఉంది ఉందనే చూస్తావు గాని లేదని దేన్ని చూడటం లేదు గదా. అలా ఉందని చూస్తున్నావంటే ఏమిటర్ధం. ప్రతి పదార్ధంలో ఉండటమనేది అనుస్యూతంగా చోటుచేసుకోవటం వల్లనే గదా. అలాగే ఆ ఉనికిలోనే ప్రతి పదార్ధమూ నీకు కనిపించటం వల్లనే గదా. ఆ ఉనికే సకల పదార్ధాలనూ వ్యాపించి వాటిని పట్టుకొని ఉందప్పటికి. బంగార మాభరణాలకు లాగా ఆ సత్తాయే ఈ విశేషాలన్నిటికీ ఆధారం. ఇది కూడా ఒక ద్వారమే మనకా సద్రూపమైన ఈశ్వర తత్త్వ మొకటి ఉందని గుర్తించటానికి.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు