లోకులపోహ పడకుండా అలా ఆరోపించిన గుణాలను మరలా అపవాదం చేసి చూపాలి. అపవాదమంటే త్రోసి పుచ్చటం. త్రోసి ప్రుచ్చినా ఎక్కడికీ పోవు గదా. అపవాదం చేసి సుఖమేమిటని శంకించరాదు. వాస్తవంగా లేవని ఆభాసగానే ఉన్నాయని తెలుసుకోటమే దాని ప్రయోజనం. అంతేగాక మరొక గొప్ప సూక్ష్మం కూడా సెలవిస్తారు భాష్యకారులు. అదేమిటంటే సర్వత్ర సర్వ దేహావయ వత్వేన గమ్యమానాః పాణిపాదాదయః లోకంలో ఎంతోమంది జీవులున్నారు. ఎంతమందున్నారో అందరికీ అన్ని అవయవాలున్నాయి. ఇంద్రియాలున్నాయి. కోటాను కోట్లు. అవన్నీ ఎలా ఏర్పడ్డాయను కొంటున్నారు. జ్ఞేయ శక్తి సద్భావ నిమిత్త స్వకార్యాః ఈశ్వరుడి మాయా శక్తి ఏదుందో దాని నిమిత్తంగా ఇవి మనకు కనిపిస్తున్నాయి. అవ్యక్తమైన ఆ శక్తి వ్యక్తమయి ఇవన్నీ ఇలా గోచరిస్తున్నాయి. ఇవన్నీ తమ తమ దర్శన స్వర్శనాది కార్యాలన్నీ ఇలా నిర్వహిస్తున్నాయంటే వీటి వెనకాల ఆశక్తి ఉండబట్టే. కాబట్టి జ్ఞేయ సద్భావలింగాని. అది ఒకటి ఉందా ఈశ్వర తత్త్వమని గుర్తించటానికీ కరచరణాది రూపాలూ Forms వీటి క్రియలూ Functions ఇవే మనకు లింగమంటే నిదర్శనం సూచకమని పేర్కొంటారాయన. వ్యక్తమైన ఈ నామరూప క్రియలను బట్టి అవ్యక్తమైన ఒక శక్తి వీటి నావరించి ఉన్నదని జడమైన ఆ శక్తి ఒక చేతనమైన తత్త్వమధిష్ఠానంగా Basis ఉన్నదని ఈ ఉపాధి ప్రపంచం ద్వారా ఆ నిరుపాధికమైన ఈశ్వర చైతన్యాన్ని పోల్చుకో గలిగితే మనం ధన్యులమని దీని కంతటికీ తాత్పర్యం.
సర్వేంద్రియ గుణాభాసం - సర్వేంద్రియ వివర్జితం
అసక్తం సర్వభృచ్చైవ - నిర్గుణం గుణభోక్తృచ - 14