దీనితో జ్ఞానమూ కర్మా అనే రెండు భావాలు కూడా సమన్వయ మవుతాయి మనకు. ఎలాగంటే ఆత్మ జ్ఞానమే ఇచ్ఛగా పైకి పొంగి క్రియగా ప్రసరించి చరా చర పదార్థాలుగా ఘనీభవించి మరలా వెనక్కు వచ్చి సుఖదుఃఖ ఫలంగా మానవుడి అనుభవంలో చేరి పోతున్నది. అప్పటికి జ్ఞానమే కర్మ. కర్మే ఫలం. ఫలమే అనుభవం. ఆ అనుభవం మరలా జ్ఞానమే. జ్ఞానం నుంచి జ్ఞానానికి చేసే ప్రయాణమే కర్మ. కర్మ అనేది ఒక పెద్ద వంతెన. జ్ఞానాన్ని మరలా జ్ఞానంతోనే కలుపుతున్నదది. అది అన్నాము గదా అని జ్ఞానం కన్నా వేరుగా లేదది. జ్ఞానమే సాగి తన దాకా తాను చేస్తున్న ప్రయాణమే కర్మ.
అందుకే కర్మ యజ్ఞం కాదిది జ్ఞానయజ్ఞం. కర్మ యజ్ఞమని భాసిస్తున్నదీ నీవు భావిస్తున్నదీ కూడా వాస్తవంలో జ్ఞాన యజ్ఞమే. కర్మణ్య కర్మయః పశ్యేత్తని నైవ కించిత్కరో మీతి యుక్తోమన్యేత అనీ భగవానుడుప దేశించాడంటే ఆ ఉపదేశంలో సారాంశమిదే. పైగా ఏకం సాంఖ్యంచ యోగంచ అని తెగేసి చెప్పాడంటే కర్మ జ్ఞానాలను వేరుగా చూడగూడదనే గదా ఆయన వివక్షితం. ఇంతకూ జ్ఞానం స్వరూపమైతే కర్మ ప్రపంచమంతా దాని విభూతి. విభూతి స్వరూపం కన్నా అన్యమని చూస్తే ఎంత పొరపాటు. తరంగ బుద్బుదాదులను జలానికి విలక్షణంగా చూచినట్టే అది. కాబట్టి జ్ఞానయజ్ఞమనే సాధన చేసి తరించమనే భగవద్గీతా బోధన.
Page 541