అంచేత ప్రత్యక్పరమాత్మల కైక్యం మనం క్రొత్తగా సాధించనక్కర లేదు. సిద్ధమైన ఆ అద్వైత భావాన్నే స్వానుభవానికి తెచ్చుకోటానికి రెడీగా ఉండాలి మన మనస్సు. దారిలో దాని కడ్డు తగిలే వాటన్నిటినీ ఒక్కొక్కటీ త్రోసి పుచ్చుతూ పోతే సరి. నిరాఘాటంగా గమ్యం చేరవచ్చు. ఆ త్రోసి పుచ్చటం కూడా ఏదో గాదు మరలా. ఆత్మ భావనతో చూచి వాటన్నిటినీ ఆత్మలో కలుపుకొంటూ పోవటమే. అందులో మొదట క్షేత్ర క్షేత్రజ్ఞులనే తేడా చూడరాదు. అది గుణత్రయం తాలూకు విలాసమేనని దాన్ని నిర్గుణమైన ఆత్మతత్త్వంగా దర్శించాలి. గుణత్రయమే అసలీ శాఖోప శాఖాత్మకంగా విస్తరించిన సంసార వృక్షం. దీన్ని ఆత్మ జ్ఞానమనే కుఠారం చేతికి తీసుకొని నరికి పారేయాలి. అందుకు అసుర సంపద అడ్డు తగిలితే దాన్ని త్రోసి పుచ్చి దైవ సంపద దగ్గర పెట్టుకోవాలి. పిమ్మట అదీ ఇదీ రెండూ ఏకాత్మ భావాన్ని పట్టుకొనే శ్రద్ధగా మారాలి. ఆ శ్రద్ధా బలంతో జ్ఞానం సంపాదించి దానితో జీవ జగదీశ్వరాత్మకంగా విభక్తమయి కనిపించేదంతా అవిభక్తమైన ఒకే ఒక ఆత్మ స్వరూపమే నని అపరోక్షంగా దర్శించ గలిగి ఉండాలి. అప్పుడిక ప్రత్యక్పరమ అనే తేడా తొలగిపోయి అంతా ఆత్మే నీ పాలిటికి. అనాత్మ కూడా ఆత్మే. ఇదే అసి పదార్థం తత్త్వమసి మహా వాక్యంలో.
Page 540