#


Index

ఉపసంహారము

  అదే సాగిస్తూ వచ్చాము మనమింత వరకూ. దానికే మన ఈ గీతాశాస్త్ర సర్వస్వమూ సమర్పిత మయింది. గీతా వ్యాజంతో మన జీవిత సర్వస్వమూ ఆ జ్ఞానాగ్ని హోత్రంలోనే పూర్ణాహుతి చేయవలసి ఉంది మనం. దాని కనుగుణంగానే మొదటి షట్కంలో దేహాత్మ దగ్గరి నుంచీ బుద్ధ్యాత్మ వరకూ మనకడ్డు వచ్చే నకిలీ ఆత్మ లన్నింటినీ ఆహుతి చేసి ప్రత్యగాత్మను బోధించి పట్టుకొన్నాము.

  అలాగే రెండవ షట్కంలో కర్తృభోక్తృ రూపంగా మనం భావించే ఈశ్వరాత్మను కూడా ఆ జ్ఞానాగ్నిలోనే హోమం చేసి పరిశుద్ధమైన పరమాత్మనే శోధించి దగ్గర పెట్టుకొన్నాం. కాగా పరిశుద్ధమైన ఇవి రెండూ ఒక దానితో ఒకటి కలిసి ఏకాత్మగా మారటానికి సిద్ధంగా ఉన్నాయి. వస్తుసిద్ధంగా అవి ఉన్నా వాటి నేకం చేసి ఒకే ఒక అఖండాత్మగా దర్శించటానికి మానవుడి మనస్సే తయారుగా ఉందా లేదా అని అనుమానం. తగినంత బలం పుంజుకొంటే చాలు. అది కూడా అసాధ్యమేమీ కాదని భగవానుడు మనకిచ్చే హామీ. మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః అన్నారంటే ఏమిటర్ధం. బంధమెలా మనసు మనమీద తెచ్చి పడేసిందో మోక్షం కూడా అదే తెచ్చి మన కందివ్వాలి. రెంటికీ సమర్థమయింది మనసే మానవుడికి.

Page 539

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు