లేదనీ చెప్పలేము. ఇదేమిటీ అన్యాయం. ఒకటి ఉందంటే ఉందని చెబుతాం. లేకుంటే లేదని చెబుతాం. అంతేగాని ఒకే పదార్ధాన్ని ఉందనీ లేదనీ పరస్పర విరుద్ధంగా ఎప్పుడైనా పేర్కొంటామా. అది శాస్త్రప్రమాణం దేవుడెరుగు. ప్రత్యక్ష ప్రమాణానికే విరుద్ధమైన ప్రసంగం గదా. అలాంటప్పుడింత పెద్ద ప్రమాణ భూతమైన గీతాశాస్త్ర మెలా చెబుతున్నదీ విరుద్ధమైన మాట. వాస్తవమే. పైకి చూస్తే విరుద్ధంగానే కనిపిస్తుంది. కాని కొంచెం లోతుకు దిగి విచారిస్తే రెండు మాటలూ సబబేనని తేలుతుంది.
అది ఎలాగంటే అనాత్మ విషయమైతే చెల్లదుగాని ఆత్మ విషయంలో అన్ని మాటలూ చెల్లుతాయి. అనేజ దేశం జవనో గ్రహీతా అంటున్న దుపనిషత్తు. తదేజతి తన్నైజతి అది కదులుతుందంటుంది. మళ్లీ కదిలేది గాదంటుంది. ఏమిటర్ధం. రెండూ సబబేనంటూ రద్వైతులు. అసలు పరస్పర విరుద్ధంగా కనిపించే భావాలెక్కడ సమన్వయ మవుతాయో అది అద్వైతం. అది పరమాత్మే. వస్తురూపంగా చలించదది. కారణమది జ్ఞాన స్వరూపం. జ్ఞానం నిరాకారం. వ్యాపకం. నిరాకారంగా ఎప్పుడు వ్యాపించిందో అప్పుడది నిశ్చలం. చలించటానికి వీలులేదు. కాని అదే నామరూపాది ఆభాస రూపంగానైతే చలిస్తుంది. స్వరూపంగా చలించదు. ఉపాధి రూపంగా చలిస్తుంది. పోతే అచలమైన రూపంగా అది మనకు కనిపించదు. నామరూపాలు లేవు గనుక ఇంద్రియ గోచరం కాదు. మనస్సుకు కూడా అతీతమే. కనుక అసత్తయిందది. ఏది గోచరం కాదో అది సత్తని చెప్పలేము గదా. అంచేత అసత్తు. అదే మరలా ఇంద్రియ గోచరమైన నామ రూపాద్యుపాధులుగా కూడా దర్శనమిస్తున్నది కాబట్టి అసత్తు కాదది.