అయితే ఇంతకూ ఆ క్షేత్రజ్ఞుడైన ఆత్మ స్వరూపమేమిటో చెబుతామన్నా రేమిటది అని అడిగితే మెల్లగా బయటపెడుతున్నాడు దాని స్వరూపాన్ని. అనాది మత్ పరం బ్రహ్మ. ఆది ఉన్నదేదో అది ఆదిమత్. ఆది మత్ కానిదేదో అది అనాది మత్తని అర్థం వ్రాశారు భాష్యకారులు. అంటే ఆది లేని పదార్ధమది. అది లేని దాని కంతం కూడా ఉండబోదు. దీనితో అనాత్మ ప్రపంచాని కంతటికీ విలక్షణమైన దాత్మ అని అర్థమవుతున్నది. కాని మనకూ ఆద్యంతాలు కనిపిస్తున్నాయి గదా మన ఆత్మ అనాదీ అనంతమూ ఎలా అయిందని అనుమానం మనకు. అందుకే చెబుతున్నాడొక రహస్యం. పరంబ్రహ్మ. నీలో ఉన్న ఆత్మ ఏమను కొంటున్నావు. నీ శరీరం మేరకే ఉందనుకొంటున్నావా. అలాగైతే జనన మరణాలు తప్పవు నీకు. మరేమిటంటారు. పరం బ్రహ్మ. దీనికన్నా అతీతమైన బ్రహ్మ స్వరూపమది. అంటే నీ ఆత్మే శరీర మాత్ర పరిచ్ఛిన్నమని చూడక సర్వత్ర వ్యాపించిన తత్త్వంగా చూచావంటే అదే బ్రహ్మం. చాలా పెద్దది విశాలమైనది అనంతమైనది అని అర్థం. అప్పుడది పరమే గాని అపరమైన జీవుడు కాదు. అప్పటికి మనమిప్పుడు జీవాత్మగా చూస్తున్నది జీవాత్మ కాదు. వస్తుతః అది సర్వవ్యాపకమైన పరమాత్మే. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి అని ఇంతకు ముందే సూచించాడు గీతాచార్యుడీ సత్యాన్ని మనకు. ఇప్పుడీ వాక్యం వల్ల మనకు జీవ బ్రహ్మైక్యాన్ని బోధించే అసి పదార్ధం చక్కగా బోధపడుతున్నది.
సరే. బాగానే ఉన్నది. మరి సర్వవ్యాపకమైన ఆపరమాత్మ స్వరూపమెలా ఉంటుంది అని ప్రశ్న వచ్చింది. దానికి సమాధాన మిస్తున్నది గీత. ఏమని. నసత్త న్నాస దుచ్యతే. అది ఉన్నదనీ చెప్పలేము. అలాగని