అమృతం. మృతమంటే ఎప్పటికప్పుడు మారిపోయేది నశించేది సంసారం. మరణించినా సమసిపోయేది గాదిది. మరలా జన్మించవలసిందే. జన్మించినా మరలా మరణించవలసిందే. ఇది ఒక విషవలయం. ఎప్పటికీ తప్పించు కోలేవు. తప్పించుకోవాలంటే దానికొక్కటే మార్గం. అది యత్ జ్ఞాత్వా. ఆత్మ అంటే ఏమిటో గ్రహిస్తేనే సుమా నీవు మృతం గాని అమృతాన్ని పొందగలవంటాడు. ఇక్కడ ఈ మాటలో ఒక గొప్ప అధ్యాత్మ రహస్యం తొంగిచూస్తున్నది. సంసారం నుంచి పూర్తిగా బయటపడాలంటే ఎప్పటికైనా ఆత్మ జ్ఞాన మొక్కటే ఉపాయం మరేదీ గాదు. మరేదీ అంటే ఏమిటది. కర్మ - సమాధి - భక్తి మంత్రం - తంత్రం ఇలాంటి వేవీ గావని తాత్పర్యం. ఎందుకంటే ఆత్మ జ్ఞాన స్వరూపం. నిరాకారం. నిర్గుణం. సర్వవ్యాపకం. నిత్య సిద్ధం. అది క్రొత్తగా మనం సాధించవలసింది కాదు. అంటే తయారు చేసుకొనేది కాదు. లేదా ఎక్కడో ఉంటే కొని తెచ్చుకొనేదీ గాదు. అలా కాదు గనుకనే కర్మాదుల కక్కడ ప్రవేశం లేదు. మరి జ్ఞానానికి మాత్రముంటుందా అంటే జ్ఞానం దానికి సజాతీయం. కర్మాదులలాగా విజాతీయం కాదు. వజ్రం వజ్రేణ భిద్యతే అన్నట్టు సజాతీయమైన జ్ఞానమే దానికి సజాతీయమైన ఆత్మను పట్టుకోగలదు. అది కూడా వృత్తి రూపమే గనుక దాని కడ్డు తగిలే అనాత్మ వృత్తులన్నింటినీ అందులో ప్రవిలాపనం చేసి దాన్ని మాత్రమే శేషింప జేస్తుంది. శేషించిన స్వరూపంలో ఆవృత్తి కూడా లయమై అది నిరాఘటంగా సాధకుడి అనుభవానికి రాగలదు. ఇదీ ఇందులో ఉన్న సూక్ష్మం.