ఇదుగో ఈ యోగాభ్యాసం చేస్తూ కూచుంటాను. ఈ మంత్రజపం చేస్తుంటాను. ఇంకా దేవుడు మేలు చేస్తే శ్రీవిద్యాదులూ దేవతోపాసనలూ సాగిస్తుంటాను. తప్పకుండా అద్వైత వేదాంత జ్ఞానంనాకు స్వానుభవానికి వచ్చి తీరుతుందని చాలామంది మనలో అపోహ పడుతుంటారు. అర్జునుడైనా నయం. మొదట అర్థమయిందని బుకాయించినా యుద్ధానంతరం నాకప్పుడేదో చెప్పావు. మధ్యలో మరచిపోయాను. మళ్లీ చెప్పమని ప్రాధేయపడ్డాడు. అంతవరకూ నిజాయితీ పరుడే. మనవాళ్లిలా కూడా కాదు. అంతా అర్థమయి పోయింది. ఇక చేయవలసింది సాధనే అని అవీ ఇవీ తొంభయి ఆరు తద్దినాలు నెత్తిన పెట్టుకొంటున్నారు.
అసలు నిజంగా అద్వైత జ్ఞానమే నీకు ఒంటబడితే ఇక దానికి భిన్నంగా సాధన అభ్యాస మనుష్ఠాన మంటూ ఏదీ లేదు. ఉందంటే అది అద్వైతమే గాదు. ద్వైతమది. మరేమి టంటారు సాధన. ఆ జ్ఞానాన్ని నిత్యమూ మనసులో ఆవృత్తి చేసుకోటమే సాధన. జ్ఞాన సంతాన కరణమని పేర్కొంటారు దీన్ని భాష్యకారులు. బ్రహ్మాకార వృత్తి నలా పొడిగించుకొంటూ పోవటం. మానసికమిది. వాచికం గాదు. కాయికం కాదు. అలాంటప్పుడీ శ్రీ చక్రాదు లేమిటి. యోగాభ్యాసాదు లేమిటి. అలా సాగిస్తే అద్వైత జ్ఞానానికి దూరమై పోతున్నావు నీవు. అది మొదలు చెడ్డ బేరం. ఇదీ ఇందులో ఇమిడి ఉన్న సూక్ష్మం.
Page 532