సమాధాన మిస్తున్నాడిక శిష్యుడు. ఆనాటి అర్జునుడే గాదు శిష్యుడంటే. ఆ మాటకు వస్తే ఆనాటి కృష్ణుడే గాదు గురువంటే కూడా. ఎప్పుడూ ఉంటారు గురుశిష్యులీ లోకంలో. ఎప్పుడూ ఉంటుందీ బోధ. ఎప్పుడూ ఉంటుంది శిష్యుడు గ్రహించాడా లేదా అనే సందేహమూ పరీక్షా ఆచార్యుడికి. మంచి ప్రజ్ఞావంతుడైన శిష్యుడైతే చెప్పింది చెప్పినట్టు గ్రహించి కృతార్ధు డవుతాడు. అలా కాకుంటే ఎంత చెప్పినా అది గురువుకు కంఠశోష, శిష్యుడికి కర్ణ శోష. ఇదీ విషయం.
ఇప్పుడు తాను చాలా ప్రజ్ఞాశాలి అయిన శిష్యుడిలాగే మాటాడుతున్నా డర్జునుడు. వినండి. నష్టో మోహఃస్మృతి ర్లబా త్వత్ప్రసాదాత్ మయా. స్వామీ మీ అనుగ్రహం వల్ల నా అజ్ఞానమంతా పటాపంచలయి పోయింది. ఆత్మ స్వరూపమేమిటో చక్కగా అర్థం చేసుకోగలిగాను. ఆత్మా కార వృత్తి ఏర్పడ్డది నాకు. స్థితోస్మి గత సందేహః - ఇక ఎలాటి సందేహాలూ లేవు నాకు. కరిష్యే వచనంతవ. సిద్ధాంతం బాగా ఒంటబట్టింది కాబట్టి మీరు చెప్పిన మార్గంలో దాన్ని అమలు పరచి తప్పకుండా పరమ పురుషార్ధాన్ని అందుకోగలనని నాకు నమ్మకం అంటాడు.
ఆనా డర్జును డన్నాడనే గాదు. ఈనాడు మనం కూడా అలాగే అంటుంటాము. ఇంకేముంది ఇన్నేండ్ల నుంచీ విన్నాము గదా. అంతా అర్థమయింది గదా. అది అభ్యసించటమే గదా ఇక మిగిలిపోయింది.
Page 531