ప్రియకృత్తమః మానవ జాతిలో అంతకన్నా నాకు సన్నిహితుడూ ప్రేమపాత్రుడూ మరొకడు లేడు. ఇప్పుడే గాదు. ఎప్పుడూ ఉండబోడు. నచ తస్మాదన్యః ప్రియతరః - అతనికన్నా ఎక్కువ ప్రేమ పాత్రుడిక ఎప్పుడూ ఉండబోడు. అయితే యోగ్యుడైన వాడెవడో పరీక్షించి వాడైనా తన్నాశ్రయించి అడిగి తెలుసుకొనే జిజ్ఞాస ఉన్నవాడైతేనే బోధించాలి. అప్పుడే వాడు నాకభిమతుడూ ఆప్తుడూ నంటాడు.
అధ్యేష్యతే చ య ఇమం - ధర్మ్యం సంవాద మావయోః
జ్ఞాన యజ్ఞేన తేనాహ - మిష్టః స్యా మితి మే మతిః - 70
అంతే కాదు. ఆచార్యుడి లక్షణమిదైతే గురుముఖంగా విద్యనందుకొనే శిష్యుడి లక్షణం చెబుతున్నా డిప్పుడు. అధ్యేష్యతే చ య ఇమం. మోక్ష ధర్మాన్ని బోధించే కృష్ణార్జున సంవాద రూపమైన ఈ ఆధ్మాత్మ విద్య నెవడు చక్కగా యధాతధంగా అభ్యసిస్తాడో వాడెవడో తెలుసా. వాడిక ఏ భౌతికమైన యజ్ఞాది కర్మలూ చేయనక్కర లేదు. జ్ఞాన యజ్ఞేన - జ్ఞానమనే మహా యజ్ఞమే చేసినవాడవుతాడు. అలాటి జ్ఞానయజ్ఞ మాచరిస్తేనే నన్ను సర్వవిధాలా పూజించినవాడు. ద్రవ్య రూపమైన మిగతా యజ్ఞాలసలు యజ్ఞాలే గాదు. స్వర్గాది ఫలమిచ్చినా మరలా జన్మ పరంపర తప్పించలేవవి. ఆత్మ జ్ఞాన మనే యజ్ఞమలాంటి అల్పఫలం కాదు. అనంతమైన మోక్షఫలమిది. కనుక నిరంతర నిదిధ్యాసనా శీలుడైన జ్ఞాని అంటేనే నాకు ఇష్టం. మరెవడు కాడంటాడు.
Page 527