అయితే అదంటే ఏమిటా అది. మామేకం శరణం వ్రజ. నన్నే శరణు వేడమంటున్నాడు. నన్నంటే కృష్ణ పరమాత్మ అనా అర్థం. కాదు. కృష్ణుడే అయితే అది ఒక విగ్రహం. కరచరణాద్యాత్మకం. అదీ ఒక నామమే రూపమే. అది నిర్గుణమైన ఆత్మ ఎలా అవుతుంది. మరి ఈ నేనెవరు. నేనెవ రేమిటి. నీలో నాలో ఉన్న నేననే స్ఫురణే అది. అహం అనేది ప్రధమా విభక్తి ఏకవచన మైతే - మాం అనేది దాని ద్వితీయా ఏకవచనం. నేను అనే జ్ఞానాన్ని అని ఆ మాట కర్థం. మరి ఈ నేనిప్పుడే ఉంది గదా. కాదు. ఉన్నా ఇది నాదనే దానితో ఏకమై ఉన్నది. శరీరేంద్రియ మనః ప్రాణాదులతో కలిపి నేనని భావిస్తున్నాము నీవూ నేనిప్పుడు. అలాగాక వాటికి సాక్షిగా ఉన్న కేవల జ్ఞానమే నేనని చూడు. అప్పుడది నిరాకారంగా వ్యాపకంగా నిశ్చలంగా కనపడి తీరుతుంది. అదే ప్రత్యగాత్మ. అదే పరమాత్మ. అలాటి పరిపూర్ణమూ పరిశుద్ధమూ అయిన అహమనే స్వరూపమే నా స్వరూపమని దర్శించాలి సాధకుడు. అదే అద్వైతులు చెప్పే శరణాగతి. అది ధర్మాలతో కలిపి కలగా పులగ మయింది గనుక వాటిని పరిత్యజ్య దీనిని శరణం వ్రజ అని బోధిస్తున్నాడు మనకాయన. అప్పటికి నా పరిపూర్ణమైన స్వరూపాన్ని అపరిపూర్ణమైన నేను ఇది గాదు అదే నేనని భావించాలని చెప్పినట్టయింది.
Page 521