#


Index

మోక్ష సన్న్యాస యోగము

  అలా భావిస్తే ఏమవుతుంది. ఇంతవరకూ జ్ఞాన సాధకుడి కర్తవ్యమే మిటో చెప్పాడు. ఇక ఉత్తరార్థంలో వాడి సాధకునకు కలిగే సిద్ధి ఏమిటో పేర్కొంటున్నాడు. అహం త్వా - ఆ పరిపూర్ణమైన నీ అహంకారమే నిన్ను మోక్షయిష్యామి. ముక్తుణ్ణి చేస్తుంది. ఈ సంసార బంధం నుంచి బయటపడేస్తుంది. ఏమిటీ సంసారమంటే. సర్వపాపేభ్యః అన్ని పాపాలకూ నిలయం. ఏమిటా పాపాలు. మూడే. ఒకటి అవిద్య. నా పూర్ణ స్వరూపం నాకు తెలియక పోవటం. రెండు కామం. నేను అపరిపూర్ణమై శరీరం మేరకే నిలిచిపోయే సరికి పరిపూర్ణంగా నాకీ అనాత్మ ప్రపంచం కనిపించి దీన్ని పొందాలనే కామ మేర్పడింది. కాగా దీనిలో ఉండేవి పోగు చేసుకోవాలంటే మనోవాక్కాయ వ్యాపారా లేర్పడ్డాయి. ఇది కర్మ. ఈ అవిద్యా కామకర్మలే పాపాలు. పడగొట్టే దేదో అది పాపం. పాతకం. ఆత్మకు భిన్నంగా అనాత్మ నొకటి కల్పించి దానిలో పడదోశాయి మనలను. ఇది నా ఆభాసే నని మరలా నా స్వరూపాన్ని పట్టుకొని దీనివైపు చూచానో అప్పుడిది మటుమాయమై నా రూపంగానే దర్శన మిస్తుంది. అప్పుడిక నేనే నాకు మిగిలిపోయాను. ఇదే మోక్షమనే మాట కర్థం. అప్పుడిక శోక మేముంది. మాశుచః మోహం లేదు శోకం లేదు. శోకం లేదనే మాట వల్ల విషాద యోగానికి తెర పడింది. దానితో సమస్య తీరిపోయింది. విషాదమే గదా సమస్య. విషాదం సమస్య అయితే మోక్షం పరిష్కారం.

Page 522

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు