#


Index

మోక్ష సన్న్యాస యోగము

భగవానుడన్నిటి కన్నా గుహ్యతమమైన దిప్పుడు చెబుతున్నాను మనసుకు పట్టించుకోమని బోధిస్తున్నాడు.

మన్మనా భవ మద్భక్తో - మద్యాజీ మాం నమస్కురు
మామేవైష్యసి సత్యంతే ప్రతి జానే ప్రియోసిమే - 65

ఇది కర్మయోగులకు చేసే బోధ. కర్మ యోగం జ్ఞానయోగానికి మొదటి మెట్టు. దీనిలో ముందు ఉత్తీర్ణుడైతే చాలు. సాధకుడికిక మిగిలిపోయిన భూమిక జ్ఞానమే. జ్ఞాన ముదయిస్తే మరి సాధకుడా సించవలసిన దేదీ లేదు. అది గట్టిగా నిలబడటమే. దానికే జ్ఞాన నిష్ఠ అని పేరు. జ్ఞాన సంతాన కరణమని పేర్కొంటారు భగవత్పాదులు దాన్ని. అదే జీవన్ముక్తి. ప్రారబ్ధం తీరి దేహపాతమైతే అదే విదేహ ముక్తి. కనుక ఇలాటి అమూల్యమైన ఆత్మ జ్ఞానానికి పూర్వరంగ మీ కర్మయోగం. కర్మానుష్ఠానం కాదిది. కర్మయోగం. అహం మమలు వదలక పోతే అది అనుష్ఠానం. వదిలిపోతే అది యోగం. యోగమే జ్ఞానానికి దారితీసేది. అనుష్ఠానం కాదని గుర్తించాలి మానవుడు. ఎలా ఉంటుందా యోగమంటే వర్ణిస్తున్నా డిప్పుడు.

  మన్మనా భవ మద్భక్తః - సమష్టి చైతన్యమైన పరమాత్మ మీదనే మనసు పెట్టుకోవాలి సాధకుడు. వ్యష్టి సమష్టిని ధ్యానిస్తూ పోతే సదా తద్భావ భావితః అన్నట్టు సమష్టి భావనతో నిండిపోతుంది మనస్సు. మద్భక్తః

Page 516

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు