ఇది నిరపేక్షమైన మోక్ష విద్య. అది మారకమైతే ఇది జన్మ తారకం. కనుకనే గుహ్యాతి గుహ్యం. The top secret of life. ఇది నీకు బయటపెట్టానంటే నా బాధ్యత ఇక ఏమి మిగిలిపోయిందని. అంతా తీరినట్టే.
పోతే ఇక నీ బాధ్యత ఏమో తెలుసా. విమృశ్యైత దశేషేణ - నీవు బాగా తలస్పర్శిగా విమర్శించుకో దీన్ని. శ్రవణం మాత్రమే చేశా వింత వరకూ. అది మాత్రమే చాలదు. ఈ చెవితో విని ఆచెవితో వదిలేయవచ్చు. అలా కాదు. బాగా మననంచేయి. విచారణ చేయి మనస్సులో. అలా నెమరు వేసుకొంటే గాని అది నీ సొమ్ము గాదు. ఆఁ అంత బాధ్యత ఎవరు పెట్టుకొంటారు. విన్నాను గదా అక్కడికి చాలునంటావా. నీ ఇష్టం. యధేచ్ఛసి తధాకురు. చేయనని మొండికెత్తిన వాడి నెవడూ ఏమీ చేయలేడు. వాడిచేత ఏ పనీ చేయించలేడు. అంచేత దీని మంచి చెడ్డలు నీకే వదిలేశాను. చేశావా బాగుపడతావు. చేయకపోయావా సమస్య నలాగే ఉంచుకొన్న వాడవవుతావు. రోగముంటే ఉన్నదిలే డాక్టరు మాట ఎందుకు వినాలి మందెందుకు పుచ్చుకోవాలంటే ఆరోగి నేమి చేయగలం. డాక్టరుకేమీ నష్టం లేదు. రోగే అన్ని విధాలా నష్టపోతాడు. అలాగే నష్టపోయేవాడూ కష్టపడేవాడూ సాధన చేయని మానవుడే.
సర్వ గుహ్యత మం భూయః - శృణుమే పరమం వచః
ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ - 64
Page 511