#


Index

మోక్ష సన్న్యాస యోగము

పెద్ద విషాదం మరణమైతే అన్ని పరిష్కారాలకూ బ్రహ్మాండమైన పరిష్కార మమృతత్వం. ఇంతకన్నా మానవుడు కోరదగిన పురుషార్థమే మున్నది. పరమ పురుషార్థమిది. ధర్మం కాదు. అర్థం కాదు. కామం కాదు. అవి పురుషార్థాలే అయినా శాశ్వతం కావు. ఇది శాశ్వతమని పేర్కొంటున్నారు గమనించండి. ఇది లభిస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కనుక ఇదే అసలైన పురుషార్ధమసలైన పరిష్కారం మానవ జీవితానికి. అంతే కాదు. ఇంకా ఒక అద్వైత రహస్యమున్న దిందులో మనం గుర్తించ వలసింది. బ్రహ్మమూ మోక్షమనేది క్రొత్తగా ఏదో ప్రయత్నం చేసి సాధించవలసిందా. కాదు. అది మనలోపలా వెలపలా అంతటా ఎప్పుడూ సిద్ధంగా ఉన్న తత్త్వమే. కాని అజ్ఞానవశాత్తూ మనకది మనలోనే గుప్తమయి ఉన్నట్టు తెలియటం లేదు. అది ఇప్పుడీశ్వర భావన పెట్టుకొని ఎప్పుడు చూచామో అప్పుడు గుప్తంగా ఉన్నది వెంటనే ప్రకటమై అనుభవానికి రాగలదు. ఇందులో ఉపపత్తి ఏమిటంటే వస్తుతః మన స్వరూపం సమష్టి చైతన్యమే అయినా మన భావనలో వ్యష్టిగా కనపడుతున్న దిప్పుడు. మరలా మనం మన సమష్టి చైతన్యాన్ని ఎప్పుడు గుర్తు చేసుకొన్నామో మనమీ వ్యష్టిని ప్రవిలయం చేసుకొని సమష్టిగా అనుభవానికి తెచ్చుకోటంలో అభ్యంతర మేమున్నది. అదీ ఇందులో ఇమిడి ఉన్న ఆంతర్యం. అందుకే అద్వైతంలో

Page 509

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు