#


Index

మోక్ష సన్న్యాస యోగము

  భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని. చరా చర పదార్ధా లన్నింటినీ భ్రామయన్ - ప్రతి క్షణమూ తిప్పుతూ ఉంటుందది. ఎలా తిప్పుతుందంటే ఒక అద్భుతమైన దృష్టాంత మిస్తున్నాడు. యంత్రారూఢాని అని. యంత్రమంటే రంగుల రాట్నం. అందులో ఒంటెలూ గుఱ్ఱాలూ ఎన్నో ఉంటాయి వాహనాలు. అవి ఎక్కి కూచుంటారు మానవులు. వారిని తిప్పుతుంటా డొకడు. వాడు తిప్పుతుంటే తిరుగుతుంటారు వీరు. అలాగే ఈశ్వర శక్తి మనలను తిప్పుతుంటే నిరంతరమూ తిరుగుతూ ఉంటాము మనమంతా. మనసులో చేరి ఆలోచనలుగా నోట మాటలుగా శరీర చేష్టలుగా బాహ్యమైన వ్యవహారాలుగా అన్నీ అది తిప్పుతున్నవే. తిప్పుతుంటే మనం తిరుగుతున్నవే. మాయయా. ఇదంతా ఆ మాయా శక్తి విలాసం గాక మరేమిటి. అది మరలా ఆ మాయావి అయిన ఈశ్వరేచ్ఛ గాక మరేమిటి. కాబట్టి ఏమిటింతకూ సారాంశం. ఇలా వర్ణించటంలో మహర్షి తాత్పర్యమేమిటి. అంతా ఈశ్వరాధీనమే అయినప్పుడిక మన బ్రతుకింతేనని కూలబడి పోవటమేనా. కాదు కాదు. మరేమిటంటారు. చెబుతున్నారు. వినండి.

తమేవ శరణం గచ్ఛ - సర్వభావేన భారత
తత్ప్రసాదాత్పరాం శాంతిం - స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ - 62

Page 507

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు