ప్రపంచాన్ని వాస్తవమని చూస్తుంటాడు. చూచేసరికది వాడికి వాస్తవంగానే కనిపిస్తుంటుంది. అంచేత అందులో తలమునకలయి తన్నిమిత్తంగా కష్ట నష్టాలేవి ప్రాప్తించినా అవీ వాస్తవంగానే అనుభవిస్తాడు. ఇది ఎలాంటి దంటే ఒక స్వప్నం లాంటిది. స్వప్నం చూచేవాడి కా స్వప్న ప్రపంచమంతా వాస్తవమే. అందులో కలిగే కష్టసుఖాలూ వాస్తవమే. అలాగే ఇక్కడా.
మరి జ్ఞానికో. జ్ఞాని నిద్ర మేలుకొన్న మానవుడి లాంటివాడు. వాడు దీన్ని వాస్తవంగా ఎప్పుడూ చూడడు. జ్ఞానముదయించక ముందు వీడూ దీన్ని ఆ స్వప్న దృక్కులాగా యధార్ధమని చూచి నానా బాధలూ పడ్డవాడే. కాని జ్ఞాన ముదయించినప్పటి నుంచీ వీడి దృష్టి మారిపోయింది. వాడికి యధార్ధమైన ప్రపంచం వీడికిప్పుడు మిధ్యమాయ. మేలుకొన్న వాడికి స్వప్నం గుర్తు చేసుకొని చూస్తుంటే అది ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది వీడికీ ప్రపంచం. కనుక కష్ట సుఖాలు దీనివల్ల ఏమాత్రమూ వీడికి సోకవు. నిర్లిప్తంగా వినోదంగా భావిస్తుంటాడు ప్రతి ఒక్కటీ. ఏదైనా అనివార్యంగా కలిగినా ఇది కేవలం ప్రారబ్ధవశాత్తూ వచ్చిందేనని ఆత్మ బలంతో అనుభవిస్తాడు.
కాబట్టి ఇంతకూ విషయమేమంటే స్వభావ జేన నిబద్ధః స్వేన కర్మణా. స్వభావ జన్యమైన కర్మ అజ్ఞాని అయిన లౌకికుణ్ణి బంధిస్తుంది గాని జ్ఞానిని గాదు. జ్ఞాని అయిన వాడు నూటికి కోటి కొకడుంటాడు.
Page 503