అందుకోసం శాస్త్రాన్నీ ఆచార్యుణ్ణి ఆశ్రయించి తదుపదిష్టమైన మార్గంలో నడచుకొని పురుషార్థ సిద్ధి పొందవలసి ఉంది. అలా కాక నేను మేధావంతుణ్ణి స్వతంత్రుణ్ణి ఇతరులు చెప్పింది నేనెందుకు చేయాలని భావించావా.
యద్యహంకార మాశ్రిత్య- నయోత్స్య ఇతిమన్యసే
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి -59
అది నీ అహంకారం. నాకు నేనే స్వతంత్రుణ్ణనే భావన. అది నిన్నెప్పటికీ కాపాడదు. కొంప ముంచుతుంది. అహంకారాన్నే పట్టుకొని నయోత్స్వ ఇతి మన్యసే. నేను యుద్ధం చేయనని భీష్మించుకొన్నావో. మిథ్యైష వ్యవసాయస్తే. అది నీ అవివేకం. అసలు నీ ఆలోచనే తప్పు. ఎందుకంటే నీవు చేయనని పరుగెత్తి పోయినా చేయిస్తుంది నీ చేత. ఏమిటది. ప్రకృతిః ప్రకృతి. అంటే నీ క్షత్రియ స్వభావం. అదే నియోక్ష్యతి. నిన్ను నియోగిస్తుంది చేస్తావా చస్తావా అని. ఇంతకు ముందు కూడా చెప్పాడిది. కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః అని. దానికిది ప్రతిధ్వని.
ఇక్కడ ఒక విషయమున్నది మనమర్ధం చేసుకోవలసింది. గీత ఒక అర్జునుడికే గాదు. మనబోటి మానవులందరికీ చేసిన బోధ. అర్జునుడంటే క్షత్రియుడు. వాడికి యుద్ధమనేది కర్తవ్యమైతే కావచ్చు. మరి మనబోటి అర్జునులందరూ క్షత్రియులూ కారు. యుద్ధం చేయవలసిన ప్రసక్తీ లేదు.
Page 501