#


Index

మోక్ష సన్న్యాస యోగము

  ఈ విధంగా శిక్షణ పొంది నామీదనే మనసు పెట్టుకొని మెలగితే సర్వదుర్గాణి - జీవితంలో ఏ ఒడుదుడుకు లేర్పడినా తరిష్యసి - తట్టుకొని నిలబడగలవు. మత్ప్రసాదాత్ - నా అనుగ్రహ బలంతో సంసార బాధలన్నీ దాటి బయటపడగలవు. సమష్టి స్వరూపాన్ని పట్టుకొన్నప్పుడే వ్యష్టికి బలం. అది గుర్తించి సమష్టి స్వరూపానికభి ముఖంగా మనసూ ప్రాణమూ ఇంద్రియాలూ అన్నీ ప్రయాణం చేస్తూపోవాలి. ఎంతెంత అది దగ్గర పడితే అంతంత బలమీ జీవ చైతన్యానికి. కనుక మానవుడు చేయవలసిన సాధన అంతా ఇదే.

  అధ చేత్త్వ మహంకారాత్ ఇది నీవెందుకు పాటించాలి ఒకరు చెప్పింది నేనెందుకు వినాలని అహంకారంతో నశ్రేష్యసి. పెద్దల మాట వినకుండా పెడచెవిన బెట్టి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావో వినంక్ష్యసి. దెబ్బతింటావు జీవితంలో. ఇటు ఇహానికీ కాకుండా పోతావు. అటు పరానికీ కాకపోతావు. గమ్యం లేని ప్రయాణమది. గమ్యం జీవితాని కెప్పుడూ పరిపూర్ణానుభవమే. ప్రస్తుతమది లేదు మానవుడికి. లేకనే నానా యాతనలను భావిస్తున్నారు జీవితాంతమూ. చివరకిది సిద్ధించకుండానే జీవిత మంతరిస్తున్నది. ఏమి సుఖం. కనుక బ్రతుకు తెల్లవారే లోపల అపరిపూర్ణమైన తన స్వరూపాన్ని పరిపూర్ణం చేసుకొని పరిపూర్ణమైన సుఖ శాంతు లనుభవించ వలసిన బాధ్యత ఉంది ప్రతి ఒక్క మానవుడికీ.

Page 500

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు