#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  సామాన్యంగా లభించేది గాదిది. అందుకే అమానిత్వం దగ్గరి నుంచీ మొదట యమనియమాది శిక్షా మార్గ ముపదేశించాడు. అవి జ్ఞానం కాకపోయినా జ్ఞానసాధనాలు. అమానిత్వాదీనాం జ్ఞాన సాధనానాం అంటారాయన. వాటివల్ల భావనా పరిపాక మేర్పడితే తన్నిమిత్తంగా తత్త్వ జ్ఞాన ముదయిస్తుందట. తత్త్వజ్ఞాన మనేది ఫలం. జ్ఞాన ఫలాలోచనే హి తత్సాధనానుష్ఠానే ప్రవృత్తిః స్యాత్తని ఆయన మాట. జ్ఞానమనే ఫలితం దీనివల్ల తప్పకుండా కలుగుతుందని గారంటీ ఉన్నప్పుడే అది శ్రద్ధగా ఆచరిస్తాము. లేకుంటే ప్రయత్నించం. ప్రయత్నం వల్లనే ఫలం. అమానిత్వాదులు అలాటి ప్రయత్నం. అవి అధ్యాత్మ జ్ఞానానికి దారితీస్తే ఆజ్ఞానం తత్త్వ దర్శనంతో సమాప్తమవుతుంది. కాబట్టి అమానిత్వం దగ్గరి నుంచి ఏతత్ జ్ఞాన మితిప్రోక్తం - అన్ని భూమికలనూ కలిపి జ్ఞానమని పేర్కొన్నారట వ్యాసభగవానులు. జ్ఞానానికి తోడ్పడే అమానిత్వాదులూ జ్ఞానమే. సాక్షాత్తుగా ఆత్మ స్వరూపాన్ని మనకందించే అధ్మాత్మ జ్ఞానాదులూ జ్ఞానమే.

  పోతే ఇక అజ్ఞాన మేమిటని ప్రశ్న వస్తే చెబుతున్నాడు. అజ్ఞానం యదతో న్యధా. అమానిత్వాది తత్త్వాజ్ఞానార్ధ దర్శన పర్యంతం మేము చెప్పిన దానికేది భిన్నమో అదంతా ఇక అజ్ఞానమే. అంటే మానిత్వ దంభిత్వాదులైన ప్రతిలోమ గుణాలని అర్థం చేసుకోవాలి సాధకుడు. అర్థం చేసుకొని ఊరక కూచోటం గాదు. చేసుకొన్న తరువాత వాటిని దూరం చేసుకోటానికి ప్రయత్నించాలి. లేకుంటే జ్ఞానం మాట దేవుడెరుగు. సంసారంలో అంతకంతకూ కూరుకుపోవలసి వస్తుంది.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు