మనం ప్రయత్నంతో సాధించవలసిన లక్షణాలు. ఒకటి ఆత్మాకార వృత్తి. మరొకటి దాని ద్వారా నిరంతరమూ ఆత్మనే సర్వత్ర దర్శిస్తూ అందులో నిలకడ గలిగి ఉండటం. అదే చెబుతున్నాడిప్పుడు.
అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం - తత్త్వజ్ఞానార్థ దర్శనమ్
ఏతద్ జ్ఞాన మితి ప్రోక్త- మజ్ఞానం య దతో ఽ న్యధా - 11
అధ్యాత్మ జ్ఞానమంటే అసలైన ఆత్మ స్వరూపమేదో దాని జ్ఞానం సంపాదించటం. నిత్యత్వం. అదే ఒక వ్రతంగా పెట్టుకోటం. తత్త్వమంటే అది ఒక్కటే ఉన్న పదార్ధ మదే సత్యం. జ్ఞానార్ధం. తదాకార వృత్తే గాక దాని అర్థమేదో ఆ సచ్చిద్రూపమైన ఆత్మ స్వరూపాన్ని నేనే నని నన్ను నేనే సర్వత్ర చూస్తూ కూచోటం. కూచోట మన్నాము గదా అని కళ్లు మూసుకొని ఇక ఏ పనీ చేయకుండా మానేసి ఒక మూల కూచోటమని గాదు మరలా. ఏపని చేస్తున్నా అందులో ఆ చేసే పనీ చూస్తుండాలి. ఆ ఉపాధీ చూస్తుండాలి. ఆ ఉపాధిలోనే నిరుపాధికమైన స్వరూపాన్ని చూస్తుండాలి. నిరుపాధికమైన నేననే స్ఫురణే ఇలా ఉపాధి రూపం ధరించి నాకిలా రకరకాలుగా స్ఫురిస్తున్నదని ఒక ఇంద్రజాలం చూచినట్టు చూస్తుండాలి. కనుకట్టున్న ప్రేక్షకుడుగా కాదు. కను కట్టు లేని ఐంద్రజాలికుడిగా. ప్రేక్షకుడెవడో చూపుతుంటే చూస్తున్నానని అన్యంగా చూస్తాడు. ఐంద్రజాలికుడు నేనే ప్రదర్శిస్తున్న ఈ నాటకం నేనే చూస్తున్నాన్నని అనన్యంగా చూస్తాడు. వాడిది పరోక్షం. వీడి దపరోక్షం. వాడిది సంసారం. వీడిది విభూతి.