#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  ఇలాటి భక్తి అలవడాలంటే వివిక్త దేశ సేవిత్వముండాలి నీకు. వివిక్తమైన ప్రదేశాలంటే సర్పవ్యాఘ్రాదుల సంచారం లేకుండా సహజంగా గాని మన ప్రయత్నంతో గాని పరిశుద్ధమైన ఏకాంత ప్రదేశాలు. అరణ్యనదీ పులిన దేవ గృహాదులని వ్రాస్తున్నారు ఆచార్యులవారు. అలాంటి ప్రదేశాలలో కూచుంటే కూచున్నంతసేపు చిత్తం ప్రసీదతి యతః తతః ఆత్మాది భావనా ఉపజాయతే అంటారాయన. మనసు స్తిమితంగా ఉంటుంది. అది స్తిమితమయ్యే కొద్దీ ఆత్మాకార వృత్తి ఉదయించే అవకాశ మేర్పడుతుందట. అరతి ర్జన సంసది. వివిక్త దేశసేవిత్వ మనులోమ మార్గమైతే Positive జన సమూహంలో ప్రవేశించకుండా దానికి దూరంగా ఉండటం ప్రతిలోమం Negative. జనమంటే ఇక్కడ ప్రాకృతానాం సంస్కార శూన్యానాం అవినీతానాం అని వ్యాఖ్యానించారు భాష్యకారులు. మరీ పామరులూ సంస్కారం లేనివారూ ఏమాత్రమూ పెద్దల శిక్షణ లేనివారట జనమంటే. అలాంటి వారితో సాంగత్యం చేస్తే ఉన్న మతి పోయె చంద్రమతీ అన్నట్టు మనకున్న సద్బుద్ధి కూడా ఊడ్చుకు పోతుంది. కాని వారే సంస్కారవంతులై విద్యావంతులైతే అలాటి జనులతో సాంగత్యమెప్పుడూ వాంఛనీయమే. అది ఆత్మ జ్ఞానాని కుపకరిస్తుం దంటారాయన.

  ఈ విధంగా సత్సంగం చేసుకొంటూ దుస్సంగాన్ని పరిహరించి అవ్యభిచారి అయిన భక్తియోగ మలవరుచుకొని ఇది ఇది అని చూచే గృహారామ క్షేత్రాదులైన సకల పదార్థాలలో నేననే స్ఫురణనే సర్వత్రా పరుచుకొని ఉన్నట్టు నిరంతరమూ దర్శిస్తూ పోవాలంటే రెండే ఉన్నాయి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు