కాబట్టి ఒకటి నీ కనుకూలంగా జరిగినా ప్రతికూలంగా మారినా అంత కంగారు పడవు. సర్వసమానంగా వ్యాపించిన బ్రహ్మతత్త్వాన్నే అందులో కూడా చూచి తృప్తి పడుతుంటావు.
చూడటమంటే ఎలా చూస్తావా బ్రహ్మ తత్త్వాన్ని ఇవి లేకపోవటం వల్ల. లేకపోతే నీ దారి కడ్డు తొలగిందంతే గాని తత్త్వాన్ని దర్శించటం కాదది. అలా దర్శించాలంటే ప్రతిలోమంగానే గాక అనులోమంగా చేయాలి ప్రయత్నం. దానికి తోడ్పడేది భక్తి. భక్తి రవ్యభిచారిణీ. అనన్యమైన భక్తి. దానిమీదనే చూపు. అది ఎలాగంటే చెబుతున్నాడు. మయి చానన్య యోగేన. అన్యమైన పుత్రదార గృహాది చింతలేవీ పెట్టుకోకుండా అవి కనిపిస్తున్నా వాటిలోనే అధిష్ఠాన రూపంగా వ్యాపించి ఉన్నదాన్ని పట్టుకోవాలి నీ దృష్టి. ఏమిటది. మయి. అహమనే స్ఫురణ అన్నింటిలోనూ పరుచుకొని ఉంది. అవన్నీ మమ అయితే ఇది అహం. మమ మారుతుంది. అహం మారదు. ప్రతి ఒక్కటీ నాది నాదని నేననే భావంతో ముడిపెట్టుకొనే గదా చూస్తుంటావు. నేను అనే స్ఫురణను వదిలేసి నాదనేది నీకెప్పుడైనా కనిపిస్తుందా. అసలది ఉన్నట్టు తెలుస్తుందా. నేను మీదనే బ్రతుకుతున్నది నాది. కాబట్టి సర్వాధారమైన ఆ నేననే భావాన్నే చూస్తూ పోరాదా. పోతే అది ఎప్పుడూ తొలగిపోదా నేను. అలాపోయేది ఈ నాదే. కనుక ఏది నిత్యమో అలాటి నేనేనే జ్ఞానమే నీ స్వరూపమని దర్శించటం మంచిది. ఎప్పటికప్పుడు మారిపోయే ఈ నాది దేనికి నీకు. పట్టుకొన్నా నిలవదు గదా. ఈ పట్టుకే భక్తి అని పేరు.