బ్రతుకు కూడా సుఖం లేని బ్రతుకే. ఎప్పుడూ ఏదో ఒక వ్యాధి ప్రాప్తిస్తూనే ఉంటుంది. కాలం గడిచే కొద్దీ వార్ధక్యం వచ్చి నెత్తిన బడి శరీరం పూర్తిగా సడలిపోతుంది. మొత్తం మీద జన్మించినప్పటి నుంచీ మరణించేదాకా అన్నీ దుఃఖాలే. సర్వం దుఃఖం దుఃఖమన్నారు. దుఃఖాలయ మశాశ్వత మని భగవద్గీతే చాటుతున్నది. కాబట్టి జీవితమంతా దుఃఖ భూయిష్ఠమని గుర్తుంచుకోవా లెప్పుడూ. అలా గుర్తిస్తేనే గాని దానికి పరిహార మేమిటో ఆలోచించలేడు మానవుడు.
అలా గుర్తించాడంటే అసక్తి రనభిష్వంగః - ఏవిషయం మీదా మనసు పోదంతగా. ఆసక్తి పెంచుకో డెందులోనూ. ఆసక్తి ఏర్పడితే అది అక్కడి కాగదు. అందులో అంతకంతకూ వల్లమాలిన అభిమానమేర్పడి అదేనా సర్వస్వం అని వదులుకుంటే చస్తాననే భావమేర్పడుతుంది. దీనికే అభిష్వంగమని పేరు. అది మరీ ప్రమాదం. దానిలో మునగానాం తేలానా మీ సంసార సాగరంలో. తప్పించుకోట మసాధ్యం. పుత్రదార గృహాదిషు. అవే ఈ పుత్రకళత్ర గృహక్షేత్రాదులు. ఎంతసేపటికీ వీటిని గురించే గదా మానవుడి ప్రాకులాట. కాబట్టి అది వదలిపోవాలంటే అంత సులభంగా పోదు. నిత్యంచ సమచిత్తత్వం. ఎప్పుడూ సమచిత్తత ఉండాలి. సమమంటే సర్వవ్యాపకమైన బ్రహ్మ స్వరూపం. దాన్ని గురించి ఆలోచించటం నేర్చుకోవాలి. అలా ఆలోచిస్తూ పోతే అది ఈ పుత్ర కళత్రాది ఆలోచనలకు జవాబు చెబుతుంది. నెమ్మదిగా వీటి చింత నీకు సడలిస్తూ పోతుంది. ఇష్టానిష్టో పపత్తిషు. ఇది సడలిపోయే కొద్దీ బ్రహ్మ చింతన గట్టి పడుతుంది.