#


Index

మోక్ష సన్న్యాస యోగము

  అలాగే శబ్దాదీన్ విషయాం స్త్యక్త్వా- శబ్ద స్పర్శాది బాహ్య విషయాలతో సంబంధం పెట్టుకోరాదు. పరిహరించాలి. పరిహరించాలంటే లోకంతో అసలే వ్యవహారించకుండా హఠయోగులలాగా ఒక మూల కళ్లు మూసుకొని కూచోవాలని గాదు. అలాగైతే దైనందిన జీవితమే సాగదు. బ్రతుకు తెరువంత కన్నా సాగదు. ఒకవేళ మొండికి సండికలా కూచోబోయినా కూచోనివ్వదు గదా ప్రారబ్ధం. అన్న వస్త్రాదులైనా కావాలి గదా మానవుడికి. అంచేత పరిత్యజించటమంటే అర్థం చెబుతున్నారు స్వామివారు. శరీర స్థితి మాత్ర హేతుభూతాన్ కేవలాన్ ముక్త్వా తతో ధికాన్ సుఖార్థాన్ త్యక్త్వా అని. శరీరం నిలవటానికి జీవయాత్ర సాగటానికి అవసరమైనంత వరకూ సంబంధం పెట్టుకో లోకంతో. అంతకు మించి భోగభాగ్యాల కోసం ప్రాకులాడ రాదంటారాయన. శారీరం కేవలం కర్మ అని శరీర స్థితి మాత్ర స్సన్ అని ఇంతకు ముందు చెప్పిన మాటే ఇది. అలా కాకుంటే ఆత్మాభిముఖంగా సాగవలసిన మనస్సు అనాత్మ ప్రపంచాలోచనలతో దాని వ్యవహారంతో నిండిపోయి అందులోనే తలమునక లవుతుంది. అది సాధనను దెబ్బతీస్తుంది. ముందుకు సాగనివ్వదు.

  ఇంకా ఒకటున్నది సూక్ష్మం. రాగద్వేషౌ వ్యుదస్యచ. శరీరం నిలవటానికి పోగు చేసుకొనే అన్నపాన వస్త్ర గృహ గృహోపకరణాలు కూడా ప్రాప్తించినపుడు వాటి మీద ఎక్కడ లేని మమకారం పెట్టుకోరాదు.

Page 489

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు