కాకున్నా ఒక్కమాట అడుగుతాను. జవాబు చెప్పమంటా రాయన. ఆత్మ అంటే ఏమను కొంటున్నావు. నేననే జ్ఞానమే స్ఫురణే గదా అది. అది నీ దగ్గర లేదా ఇప్పుడు. నేను నేనని అంటూనే ఉన్నావు గదా. అలాంటప్పుడది నీవు త్రోసివేయగలవా. క్రొత్తగా తెచ్చినెత్తిన పెట్టుకోగలవా. ఆబాలగోపాలమూ ప్రసిద్ధమప్పటి కాత్మ అనేది. అదే నీవూహించినట్టు అప్రసిద్ధమైతే నీవు సుఖమను భవించలేవు. దుఃఖమనుభవించ లేవు. నీవే లేకుండా వాటినెలా అనుభవించగలవు. సుఖం సుఖం కోసమూ దుఃఖం దుఃఖం కోసమూ కాదుగదా. నీకోసమే గదా అన్ని భావాలూ, ఏదైనా లోకంలో ఆధారమే లేకపోతే ఆ అనుభవాని కర్థమేముంది. అంచేత నా దేహమింత పరిమాణమున్నదని కొలత వేయకుండా నీకు నీకే ఎలా తెలుస్తుంటుందో అలాగే నీకు నీకే తెలుసు నీవున్నావని. అది జ్ఞానమేనని.
జ్ఞానమే నా స్వరూపం కావచ్చు. అయినా అది నిరాకారం గదా ఉందని ఏమిటి నమ్మకమని నీ ఆక్షేపణ. సమాధానం చెప్పమంటావా. నిరాకారమైనా నీ అనుభవమే అది. అసలు అనుభవమంటేనే అది నిరాకార మెప్పుడూ. అలాటి నిరాకారమైన నీ జ్ఞానాన్నే నీవు సందేహిస్తున్నావు ఉందా లేదా అని. మరి భార్యా పుత్ర మిత్రాదులూ - వస్తువాహనాదులూ నీ చుట్టూ ఇప్పుడు నీవు చూస్తున్నావే. ఉన్నాయని చూస్తున్నావా లేవని చూస్తున్నావా. అవి నీకు స్ఫురిస్తున్నాయంటావా స్ఫురించటం లేదంటావా.
Page 485