#


Index

మోక్ష సన్న్యాస యోగము

గుణాలు గాని గుణాలెన్నైనా చెప్పవచ్చు ఆత్మకు. అలాటి గుణాలు భావన చేసే కొద్దీ అవి మన జ్ఞానానికి కూడా సంక్రమిస్తాయి. బుద్ధి ఏది ఎలా భావిస్తే అలాగా మారి పోతుంది. కాబట్టి ఆత్మ తాలూకు నైర్మల్యాది గుణాలతో బుద్ధి నిండిపోతుంది. అలాగే భాసిస్తుంది మానవుడికి బుద్ధి. బుద్ధి మీద పడ్డ చైతన్య ప్రకాశం ఇంద్రియాల మీద పడి అవీ అలాగే ప్రకాశిస్తాయి. ఇంద్రియ ప్రకాశం శరీరం మీదపడి అదీ వాటిలాగే వెలిగిపోతుంది. ఇది ఎలాంటిదంటే ఇప్పుడీ సూర్యరశ్మి మన పట్టణం మీదా ఇంటి మీదా మన ఒంటిమీదా మనచుట్టూ ఉన్న వస్తువుల మీదా పడి ప్రకాశిస్తున్నదంటే వాటి పాటికవి కాదు గదా ప్రకాశించటం. ప్రకాశం సూర్యుడిదే. దాని ఆభాసలే ఇవన్నీ. అంటే అది ఒక్కొక్క దాని మీద పడి ఇవి వాటి పాటికవే ప్రకాశిస్తున్నట్టు కనిపిస్తుంటాయి. వీటిది కాదిది. కాని వీటిది కాకున్నా వీటి మీద పడ్డ నకిలీ ప్రకాశమే అసలైన సౌరప్రకాశాన్ని మనకు సూచిస్తుంటుంది. మనమా అసలును వీటి ద్వారానే పట్టుకోవాలి. ఎలాగా. వీటి రూపాలను మనసుకు రాకుండా వదిలేసి కేవలం వీటిలోని ప్రకాశాన్నే చూడాలి. అప్పుడవి సంకేతమయి అవి చూపేది సత్యమని గుర్తిస్తాము. అలా కాక ప్రకాశించే వీటినే పట్టుకొని ప్రకాశాన్ని వదిలేశామను కోండి. సత్యమైన సౌర ప్రకాశం తప్పిపోతుంది. అసత్యమైన ఈ వస్తువులే మిగిలిపోతాయి.

Page 482

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు