#


Index

మోక్ష సన్న్యాస యోగము

అసక్త బుద్ధి స్సర్వత్ర - జితాత్మా విగత స్పృహః
నైష్కర్మ సిద్ధిం పరమాం సన్న్యాసే నాధి గచ్ఛతి - 49

  ఈ ప్రకారంగా ప్రతి ఒక్కడూ జీవిత లక్ష్యమేదో అది మనసులో ఉంచుకొని తన తన ధర్మ మాచరిస్తూ పోతే అది నిష్కామ కర్మ యోగమని పించుకొంటుంది. అది బాగా పరిపాకానికి వస్తే కర్మ సిద్ధి జ్ఞానసిద్ధిగా మారుతుంది. దానికే నైష్కర్మ్య సిద్ధి అని పేరు. జ్ఞాన నిష్ఠనే నైష్కర్మ్యమని పేర్కొంటారు. ఎందుకంటే ఇక వాడు చేయవలసిన కర్మ అంటూ ఏదీ మిగలదు. కర్మ అంటే ఇక్కడ శాస్త్రం వాడికి విధించిన నిత్య నైమిత్తికాది కర్మలని అర్థం. అవన్నీ చేసినా ఒకటే చేయకున్నా ఒకటే వాడు. జ్ఞానంగా మారిపోతాయి కర్మలన్నీ. జ్ఞానే పరిసమాప్యతే అని ఇంతకు ముందే గదా వర్ణించారు. కాని అన్నీ సమసిపోయినా శరీరమనే ఉపాధి ఉన్న నేరానికి ప్రారబ్ధమనే కర్మ మాత్రమొకటి ఉంటుంది జ్ఞానికి. అది ఇంతకు ముందు చేసిన బాకీ కాబట్టి అనుభవిస్తే అదీ తీరిపోతుంది. అది కూడా ఎప్పటికప్పుడు జ్ఞానదృష్టిలో కరిగించి పారేస్తుంటాడు జ్ఞాని. కాబట్టి వాడి నిష్ఠ కది ప్రతి బంధకం కాదంటారు వేదాంతులు. పోతే ఈ నైష్కర్మ్య సిద్ధి ఏమిటో అది ఎలాటిదో వర్ణిస్తున్నారు వినండి.

  నైష్కర్మ్య బుద్ధి స్సర్వత్ర. నిష్కర్మ భావమే నైష్కర్మ్యం. అదే సిద్ధి. కర్మ గాని దేది. జ్ఞానమే గదా. కనుక నైష్కర్మ్య సిద్ధి అంటే జ్ఞాన సిద్ధి.

Page 477

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు