సహజం కర్మ కౌంతేయ సదోష మపి నత్యజేత్
సర్వారంభాహి దోషేణ ధూమే నాగ్ని రివా వృతాః - 48
కాకపోయినా మంచి చెడ్డలని విమర్శిస్తున్నావే. ఏది మంచో చెప్పు చూతాం. ప్రతి కర్మా ఆ మాటకు వస్తే చెడ్డదే. ఎందుకంటే సహజం కర్మ. జన్మతోనే వచ్చింది నీకది. త్రిగుణాత్మకమే గదా నీ జన్మ. అందులో నీవు చేసే కర్మ కూడా త్రిగుణాత్మకమే. గుణాతీతం కానంత వరకూ సదోషం. దోషభూయిష్ఠమే ప్రతి పనీ. అది మానసమైనా వాచికమైనా కాయికమైనా సదోషమే. మరి అలాంటప్పుడెలా వదులుకోగలవు. ఏది వదులుకోగలవు. సర్వారంభాహి. నీకు విధించిన కర్మ మంచిది కాదు. మరొకరు చేసేదైతే బాగుంటుందని నీవు దాన్ని పట్టుకొన్నా అదీ గుణం కాదు. దోషమే. సర్వారంభాః అంటున్నాడు మహర్షి. అన్ని కర్మలూ అలాంటివే. ధూమే నాగ్ని రివావృతాః నివురు కప్పిన నిప్పులాంటి వన్నీ. నిప్పుంటే పొగరాజకుండా పోదు. పొగ వస్తుంది గదా అని నిప్పు చేయటం మానేస్తావా. అలాగే పొగ కమ్మని నిప్పుంటుందా. కాబట్టి పొగ వైపు గాదు నీవు చూడవలసింది. నిప్పువైపు. నిప్పుకూడా కాదు. నిప్పు ద్వారా దాని వెలుగులో మార్గం వైపు. మార్గం ద్వారా చివరకందుకో వలసిన జీవిత గమ్యం వైపు.
Page 476