#


Index

మోక్ష సన్న్యాస యోగము

  అంచేత శ్రేయాన్ స్వధర్మో విగుణః - ఇదేమిటో ఇంత హీనమైన వృత్తి నాకు నిర్దేశించాడు. ఇదే నీ ధర్మమంటా రేమిటి అని ముఖం చిట్లించుకోరాదు. తాను చేసే పని విగుణః గుణం లేనిది నికృష్టమైనదని తక్కువగా చూడరాదు. అలాగైతే విదుర ధర్మవ్యాధాదులు బ్రహ్మవేత్తలే కాలేరు. తతిమా వారికి జ్ఞానోపదేశం చేయలేరు. అంచేత ఏదీ తక్కువా కాదు. ఎక్కువా కాదు. నీ ధర్మం నీది. పరుల ధర్మం పరులది. స్వధర్మం నీవు వదిలేసి పరధర్మం నెత్తిన పెట్టుకొన్నా సుఖం లేదు. స్వనుష్ఠితాత్ అది నీవెంత బాగా ఆచరించినా ఆచరించటం వరకే చూస్తున్నావు. దాని లక్ష్యం మీద చూపులేదు. మాకు నీ ఆచరణ కాదు. దానికి లక్ష్యమేమని నీవు భావిస్తున్నావో ఆ భావన ముఖ్యం. కాబట్టి స్వభావ నియతం కర్మ కుర్వన్. నీకు విధించిన కర్మ అది నీవు మంచా చెడ్డా అని హేతువాదం చేయకుండా ఆచరిస్తూ పోవటమే నీ కర్తవ్యం. నాప్నోతి కిల్పిషం. అది చెడ్డ పని గదా అంటే మంచి చెడులు నిర్ణయించ వలసింది నీవు కావు. కారణం నీ దృష్టి దేశకాలాదుల చేత పరిచ్ఛిన్నమైనది. నీవు చెడ్డదనుకొన్నది దూరమాలోచిస్తే మంచిదే అయి ఉండవచ్చు. అది నీకు తెలియక పోవచ్చు. అంచేత నీ కర్తవ్యం నీవు పాటిస్తూ పోతే ఎలాటి కల్బిషమూ నీకంటదని శాస్త్రం హామీ ఇస్తున్నది.

Page 475

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు