#


Index

మోక్ష సన్న్యాస యోగము

వర్ణం వాడైనా సరే. నరుడేవాడు. మానవ జన్మ నెత్తిన ప్రతి ఒక్క వ్యక్తీ నరుడే. బ్రాహ్మణుడైనా నరుడే. శూద్రుడైనా నరుడే. నారాయణు డెవడూ కాడు. నారాయణత్వం గుప్తంగా ఉంది ప్రతి జీవిలో. అది ప్రకటం చేసుకొనే కొద్దీ ఈ నరుడే నారాయణు డవుతాడు. అప్పుడందరూ సమానులే ఇప్పుడు కూడా వస్తుసిద్ధంగా సజాతీయులే. ఏకరూపులే. కేవలం వ్యావహారికమైన స్థాయిలోనే అనేకంగా విభక్తమయి కనిపిస్తున్నారు.

  వారి వారి గుణ సంపర్కాన్ని బట్టి నడవడిని బట్టి వ్యావహారికంగా భిన్న వృత్తులైనా స్వేస్వే కర్మణ్యభిరతః తమ తమ వృత్తులు మానకుండా వాటిలోనే ఆసక్తులయి నియతమైన ధర్మాన్ని ఆచరిస్తూ పోతే సంసిద్ధిం. ప్రతివాడూ జ్ఞాననిష్ఠా యోగ్యమైన స్థాయినందు కోగలడు. స్వకర్మ నిరతః సిద్ధిం యథా ప్రాష్స్యతి తచ్ఛృణు. తమ వ్యక్తిగతమైన ధర్మ మాచరిస్తూనే అందరూ కలిసి ఒకే సిద్ధినెలా పడయగలరని గదా నీ ప్రశ్న. మోక్షానికి ప్రతివాడికీ అధికారముంది. అవకాశముంది. కారణం. బ్రహ్మ స్వరూపమైన మోక్షం సర్వత్రా ఉంది. సర్వులలో ఉంది. అలాంటప్పుడెవడే మార్గంలో నుంచి వస్తేవేమి గమ్యమదే అయినప్పుడు. ఎటు వచ్చీ గమ్యమదే ఆ పరమాత్మ తత్త్వమే ననే చూపుండాలి. అలాటి దృష్టి ఉంటే ఎవడే వృత్తి నవలంబిస్తున్నా దాని ద్వారానే చేరగలడా గమ్యస్థానం. ఆ దృష్టి ఉన్నంత వరకూ తదభి ముఖంగా పయనిస్తున్నంత వరకూ వర్ణ భేదం లేదు.

Page 472

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు