#


Index

మోక్ష సన్న్యాస యోగము

  ఇదుగో ఈ గుణాలను బట్టీ వారి వ్యవహారాన్ని బట్టీ ఏర్పడ్డవే వర్ణాలు. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు వర్ణా లేర్పడ్డాయంటే ఏమిటను కొంటున్నారు. ఇవి ఎవరో నిరంకుశంగా చేసినవి కావు. వాటి పాటికవి ఏర్పడ్డవే. వాటి పాటి కని అన్నప్పుడు ఆయా మానవులలో ఉన్న స్వభావమే. దానికి చెందిన గుణాలే. ప్రకృతి గుణ వైషమ్యాన్ని బట్టే చాతుర్వర్ణ్య మేర్పడింది. అందులో సత్త్వగుణం బ్రాహ్మణత్వానికి కారణం. సత్త్వం తగ్గిపోయి రజస్సు కొంచెమెక్కువ మోతాదులో ఉంటే అది క్షత్త్రియత్వానికి కారణం. మరి రజస్సు ప్రధానమై తమస్సు అప్రధానమైతే అది వైశ్యత్వం. తమస్సే ప్రబలమై రజస్సు తగ్గిపోతే శూద్రుడని పేర్కొనడాని కదే నిమిత్తం. ఎక్కడైనా నిమిత్తాన్ని బట్టే నైమిత్తికం. నిమిత్త మిక్కడ సత్త్వాది గుణాల వైషమ్యమే. అది ఆవాపోద్వాపాలతో నాలుగు విధాలైతే దాని ననుసరించి బ్రాహ్మణాది వర్ణాలు కూడా నాలుగయ్యాయి. సంగ్రహంగా చెబితే శాంత స్వభావమే బ్రాహ్మణత్వం. ఈశ్వర స్వభావమే క్షత్రియత్వం. ఈహా లేదా లోభ గుణమే వైశ్యత్వం. అలాగే మూఢ స్వభావమే శూద్రత్వం. వారిలో ఈ గుణాలున్నా యని కూడా కాదు. ఈ గుణా లెవరిలో ఉంటే దాన్ని బట్టి వారు బ్రాహ్మణులూ క్షత్రియులూ వైశ్యులూ శూద్రులని భావించవచ్చు.

Page 467

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు