అలాకాక రాజసుడైన వాడైతే ఎలా ఉంటాడు. రాగీ - కర్మ ఫల ప్రేప్సుః -కావలసినంత ఉబలాట ముంటుంది వాడికి. కర్మ ఫలప్రేప్సుః తాను చేసే పనికీ ఫలితమెప్పుడు లభిస్తుందా అది అనుకూలంగానే లభించాలి సుమా - అది నాకెప్పుడను భవానికి వస్తుందా అని ఎదురు తెన్నులు చూచేవాడు. లుబ్ధః - పరద్రవ్యేషు సంజాత తృష్ణః -మరొకరి సొమ్ము మనకెలా చేకూరుతుందా అని బీదసాదలకు కూడా పైసా వినియోగించక హింసాత్మకః ఇతర జీవులను పీడించి అయినా డబ్బు కాజేయాలని అశుచిః ఏమాత్రమూ చిత్తశుద్ధి లేక హర్ష శోక సమన్వితః - తన కనుకూలమైతే పొంగిపోతూ - అనుకూలించకపోతే కుంగిపోతూ పనులు సాగించే ప్రతివాడూ రాజసుడే. దీనితో మానవుడికున్న బలహీనత ఎలాంటిదో కడిగేసినట్టయింది మహర్షి సాధారణ మానవుడి జీవిత మిలాటిదే. లోకం కోసం తాను గాదు. తన కోసమే లోకముందని భావిస్తాడు వాడు.
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః - శఠో నైకృతికోలసః
విషాదీ దీర్ఘసూత్రీచ - కర్తా తామస ఉచ్యతే - 28
ఇక మూడవవాడున్నాడు తామసుడు. వాడెలాటి వాడో బయటపెడుతున్నాడు. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః వాడెలాటి వాడంటే అయుక్తః ఒక విషయంలో స్థిరత్వం లేదు వాడికి. చంచలమైన స్వభావం.
Page 453