#


Index

మోక్ష సన్న్యాస యోగము

మొదురుగా చెప్పిన భావాలన్నీ ఇక్కడే గదా ఉపసంహారం కావలసింది. ఎన్నో లేవు కూడా ఆభావాలు. అన్ని భావాలూ కర్మ జ్ఞానాలు రెండింటిలో సమసి పోవలసిందే. అందులో కర్మయోగం సాధకావస్థకూ జ్ఞానం సిద్ధావస్థకూ సూచకం. సాధకుడి సంగతయింది.

  సిద్ధుడైన వాడెలా ఉంటాడో వర్ణిస్తున్నా డిప్పుడు. నద్వేష్టి అకుశలం కర్మ. ఇది కామ్యకర్మ పనికిరాదని పేరు పెట్టి ఒక కర్మను కాదని త్రోసి పుచ్చడు జ్ఞాని. అదే పనిగా తాను చేయకపోయినా చేసే వారి నెప్పుడూ ఆక్షేపించడు. అలాగే కుశలే నానుషజ్జతే. ఇదుగో ఇది చాలా మంగళకర మైనదీ నిత్య కర్మాదికమని ఎంత మంచిదైనా దాని నదేపనిగా అనుష్ఠించాలనే ఆసక్తి చూపడు. రాగద్వేషాలు రెండూ లేవు జ్ఞానికి. ఎందుకంటే వాడు జ్ఞాని. సర్వమూ ఆత్మ స్వరూపంగా చూడవలసిన వాడు. అలాంటప్పుడొకటి కాదని నిరాకరించాడంటే అందులో ఆత్మకు భిన్నమైనదేదో చూస్తున్నాడన్న మాట. అలాగే ఒకటి ఔనని నెత్తిన పెట్టుకొన్నాడంటే అది మాత్రమే ఆత్మ అనే సంకుచిత భావంతో మెలగుతున్నా డన్న మాట. అంతా ఆత్మే అయినప్పుడిక కర్మ ఎక్కడిది వాడికి. ఒక వేళ కర్మ కనిపించినా జ్ఞానమే కర్మగా కనిపిస్తుంది వాడి దృష్టికి. జ్ఞానం తన స్వరూపం కర్మ తన విభూతి అనుకొన్నప్పుడిక జ్ఞానాని కన్యంగా కర్మ ఎక్కడిది.

Page 431

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు