సిద్ధుడే అయితే వాడికీ నిత్యనైమిత్తికాది విధులు కూడా వర్తించవు. శాస్త్ర చోదితమైన కర్మలేవీ వాడాచరించ నక్కర లేదు. కర్మాధి కారి గాదు. జ్ఞానాధికారి వాడు. అయినా ఉపాధి ఉన్నంతవరకూ ఏదో ఒక పని పెట్టుకోక తప్పదు గదా ఎంత జ్ఞానికైనా అని ప్రశ్న వస్తే అది వాడికి ప్రారబ్ధవశాత్తూ వచ్చేదే గాని శాస్త్రీయం కాదంటా డాయన. ప్రారబ్ధమైనా ఉంది గదా అంటే ఎప్పటికప్పుడు వాడి జ్ఞానాగ్నిలో అది దగ్ధమై పోతుంది. కాబట్టి బాధ లేదంటాడు. కాని సాధకావస్థలో జ్ఞానమింకా పరిపక్వం కాలేదు కాబట్టి నిత్యనైమిత్తికాదులు తప్పవు. అయితే ఒక పక్క జ్ఞాన భావన కూడా అలవరుచు కొంటున్నాడు కాబట్టి అహం మమలు వదిలేసి సాగిస్తే అదీ అంత బాధించదంటా డాయన.
నియతస్యతు సన్న్యాసః కర్మణో నోపపద్యతే
మోహా త్తస్య పరిత్యాగః - తామసః పరికీర్తితః -7
అయితే ఒక్కమాట. ఇంకా సాధకావస్థలో ఉండగానే తొందరపడి కర్మలు వదులుకోటం మంచిది కాదంటాడు పరమాత్మ. ఎందుకంటే ఆత్మ జ్ఞానానికి శిక్షణ పొందుతున్నాడే గాని వాడు సుశిక్షితుడు కాలేదు. కాబట్టి శాస్త్ర విహితమైన కర్మ లాచరించవలసిన బాధ్యత ఉంది వాడికి. అలాగని కామ్యనిషిద్ధ కర్మలు చేయమని చెప్పటం లేదు. నిత్య నైమిత్తికాది నియత కర్మలైనా చేయాలి. చేయనని భీష్మించుకొన్నా లాభం లేదు. నోప పద్యతే.
Page 425