#


Index

మోక్ష సన్న్యాస యోగము

ప్రసరిస్తున్నదనే దృష్టే ఉంటుంది. అలాంటి దృష్టి పెట్టుకొనే సాధన చేస్తుంటాడు వాడు. ఇక సిద్ధుడికైతే ఎప్పటికప్పుడది జ్ఞానంలోనే ప్రవిలయమై పోతూ అంతా జ్ఞానంగానే సాక్షాత్కరిస్తుంటుంది. వేదాంత రంగంలో సాధకుడికేది ప్రయత్నమో సిద్ధుడి కది లక్షణమని గదా చెప్పారు భగవత్పాదులు. కాకపోయినా అంతా ఆత్మ స్వరూపమనే అనుభవం కలగాలంటే అంతా అనే మాట కర్థమేమిటి. తాను చేసే కర్మ కలాపమంతా ననే గదా. అందులో ప్రతికూల మెలాగూ మానేసినా జ్ఞానార్జనకూ జ్ఞాననిష్ఠకూ అనుకూలమైన కర్మ అయినా చేయక తప్పదు గదా. తప్పదని భగవానుడే చెప్పా డితః పూర్వమే. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మ కృత్తని - అలాంటప్పుడీ ఉపాధి ఉన్నంత వరకూ ఎలా మానేస్తావు కర్మ. అయితే నిత్యనైమిత్తికాదు లన్నీ పెట్టుకొంటే మరీ బరువు కాబట్టి అవి జ్ఞానాని కుపయోగ పడవు కాబట్టి మానేయమన్నా డంత మాత్రమే. కాని జ్ఞానాని కుపకరించేవి కూడా మానేస్తే ఎలాగా. అందుకే యజ్ఞాది కర్మలు న త్యాజ్యం - కార్య మేవ తత్. అవి మాత్రం వదులుకో వద్దు. పాటించ మంటున్నాడు. అంతేకాదు. అలా పాటిస్తూపోతే అవి పావనాని మనీషిణాం జ్ఞాన సాధకుడి మనస్సు నవి శుద్ధి చేసి జ్ఞాన బీజా లందులో అంకురించటానికే అవి బాగా స్థిరపడటానికే తోడ్పడతా యంటాడు . భగవానుడు. అయితే అవి యాంత్రికమైన యజ్ఞాదులు కావు. జ్ఞానాత్మకమైన వని షరతు పెడతాడు. అదీ ఇక్కడ మనం గ్రహించ వలసిన సూక్ష్మం.

Page 421

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు