మదంభిత్వమని వర్ణిస్తున్నాడే అవి జ్ఞానం కావు. జ్ఞానం కాకుంటే ప్రమాణమంత కన్నా కాలేవు. అయితే ఎందుకు చెప్పినట్టు. ఈ సందేహమిప్పుడు మనబోటి శ్రోతలకే గాదు. ఆనాడు భగవత్పాదులకే వచ్చింది. వచ్చి ఏతద్ జ్ఞాన మంటున్నాడే మహర్షి ఇదంతా జ్ఞానమెలా అయిందని తన్ను తానే ప్రశ్నించుకొన్నా డాయన. ప్రశ్నించుకొని అమానిత్వాదులు సాక్షాత్తుగా ప్రమాణం కాకపోయినా ప్రమాణభూతమైన ఆత్మ జ్ఞానం కలగటానికి సాధకుడి మనస్సుకు ముందుగా తగిన శిక్షణ ఇచ్చి వాడి గ్రహణ శక్తికి తోడ్పడతాయి. జ్ఞాన నిమిత్తత్వాత్ జ్ఞానముచ్యతే అని సంజాయిషీ ఇచ్చారు కూడా. అమానిత్వాది దైవగుణాలు ముందుగా అలవరుచుకొని సాధకుడైన వాడు తన మనస్సును పరిశుద్ధమూ ఏకాగ్రమూ చేసుకొంటే ఆ తరువాత అందులో జ్ఞాన బీజా లంకురించి అది ఆత్మాకార వృత్తిగా మారి ఆ ప్రమాణ బలంతో వాడు సూటిగా క్షేత్రజ్ఞ స్వరూపాన్ని పట్టుకోగలడని ఆయన తాత్పర్యం. పోతే ఇప్పుడలాటి జ్ఞానానికి దోహదం చేసే దైవ సంపద ఎలాంటిదో వరుసగా బయటపెడుతున్నాడు మహర్షి.
అమానిత్వ మదంభిత్వ మహింసా క్షాంతి రార్జవమ్
ఆచార్యోపాసనం శౌచం - స్థైర్య మాత్మ వినిగ్రహః -7
ఇంద్రియార్థేషు వైరాగ్య - మనహంకార ఏవచ
జన్మ మృత్యు జరావ్యాధి - దుఃఖ దోషాను దర్శనమ్ - 8
అసక్తిరనభి ష్వంగః - పుత్ర దార గృహాదిషు
నిత్యంచ సమ చిత్తత్వ మిష్టా నిష్టోప పత్తిషు - 9