కాని ఒక్క విషయం. దాన్ని వెంటనే వర్ణించి చెప్పడు మహర్షి ఇప్పుడు. ఇప్పుడాయన సాధకుడి కవశ్యంగా ఉండవలసిన దైవగుణాలు కొన్ని ఏకరువు పెడతాడు. పానకంలో పుడకలాగా ఇవి దేనికిప్పుడు వర్ణించటం. ఇవన్నీ క్షేత్రజ్ఞుడి స్వరూపాన్ని పట్టుకోటాని కెలా ఉపయోగ పడతాయని అడగవచ్చు.
నిజమే. లోకంలో దేనికైనా మానవుడిది ఫలానా అని దాని స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే దానికొక ప్రమాణమనేది ఉండాలి. ప్రమాణం లేకుండా ప్రమేయ మనేది ఎప్పుడే గాని మనకు బోధ పడదు. అది అసలు ఉందో లేదో కూడా చెప్పలేము. ప్రమాణమనే దెప్పుడూ జ్ఞానమే. అది ప్రత్యక్షం కావచ్చు. అనుమానం కావచ్చు. చివరకు శాస్త్రమే కావచ్చు. జ్ఞాన వృత్తి ద్వారానే గ్రహించాలి దేన్నైనా. ఇప్పుడాత్మ తత్త్వమనేది మనకు ప్రమేయం. దాన్ని గదా మనం గ్రహించాలను కొంటున్నాము. దాని కాత్మకార వృత్తి రూపమైన జ్ఞానమే మనకు తోడ్పడుతుంది. అదే పరిచ్ఛేదక మంటారు భగవత్పాదులు. అంటే ఆత్మ అంటే ఇది అని మిగతా వాటినుంచి దాన్ని తెగగొట్టి ఫలానా అని మనస్సుకు తెస్తుంది దాని స్వరూపాన్ని. పరిచ్చేదకమే ప్రమాణమంటే. అది కేవలం జ్ఞానమే The idea of the thing.
అలాటి ప్రమాణమిప్పుడు మహర్షి ఏకరువు పెట్టబోయే జాబితాలో ఉందా. ఒకటి రెండున్నాయే గాని మిగతా వేవీ లేవు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వమని - తత్త్వజ్ఞానార్థ దర్శనమని ఈ రెండూ ప్రమాణాలైతే కావచ్చు. కారణం జ్ఞానమనే మాట ఉన్నదందులో. పోతే మిగతా అమానిత్వ