#


Index

మోక్ష సన్న్యాస యోగము

భగవ దభిప్రాయం. త్యాగమంటే ఏమిటో నిష్కర్ష చేసి చెబుతాను వినమంటున్నాడు. త్రివిధ స్సంప్రకీర్తితః - అది ఒకటి గాదా త్యాగమనేది. మూడు విధాలు. మూడు విధాలంటే ఇది మరలా వికల్పం చేసి బోధిస్తున్నా డనుకో గూడదు మనం. శ్రద్ధాత్రయాదులలో ప్రతిదీ మూడేసి చెప్పాడు. సత్త్వ రజస్తమో గుణాలు మూడు గదా. అందుకే మూడు విధాలు ప్రతిదీ. త్యాగం కూడా వాటి కనుగుణంగా మూడు విధాలు. అయితే అందులో సాత్త్వికమే మనకు కావలసింది. మిగతా రాజస తామసాలు కావు. కాబట్టి రాజస తామస కర్మలు సన్న్యసించి సాత్త్వికమైన కర్మ ఆచరించమని చెబుతున్నా డిప్పుడు భగవానుడు.

  అదేమిటా ఆచరించ వలసిన కర్మ. అన్ని కర్మలూనా. కామ్యం మానేసి నిత్య నైమిత్తికాలు మాత్రమేనా. అసలి దేమిట దేమిటన్నీ మానేసి ఊరక కూచోటమా. ఇవేవీ గావు. ఇవన్నీ వికల్పాలే. ఎవరికి వారు చెబుతూ వచ్చినవే ఇవి. ఇలా మనమూ చెప్పి భగవానుడూ చెబితే విశేష మేముంది. మనం వికల్పించి చూస్తే భగవానుడు నిర్వికల్పంగా చూస్తాడు. నిర్వికల్ప మైనదే గదా నిశ్చయ మని పేర్కొన్నాము. అలాటి నిశ్చయమేదో అందిస్తున్నా డాయన. అందివ్వ బోతూ ముందుగా త్యాగం మూడు విధాలని అందులో సాత్త్వికమే అలవరుచుకోమని చెప్పి ఆ సాత్త్వికమైన కర్మ ఏమిటో ఇప్పుడు వర్ణిస్తున్నాడు.

Page 419

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు