సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్
త్యాగస్యచ హృషీకేశ - పృథక్కేశి నిషూదస -1
సన్న్యాసస్య తత్త్వం - త్యాగస్య చ పృధగ్వేదితు మిచ్ఛామి - సన్న్యాస మనీ త్యాగమనీ - ఈ రెండు మాటలూ మొదటి నుంచీ తరుచుగా నాకు వినిపిస్తూనే వచ్చావు నీవు. కాని వాటి అర్థమేమిటో నాకు స్పష్టంగా తెలియటం లేదు. రెండింటికీ ఒకటేనా అర్థం. లేక వేరు వేరర్ధా లున్నాయా. రెండూ ఒకే అర్థాన్ని చెబుతున్నాయంటే అవి రెండూ పర్యాయ పదాలు. బిడాలం మార్జాలమంటే శబ్దాలు రెండైనా అవి చెప్పే అర్థ మొకటే గదా. అలాగే ఇదీ అని అర్థం చేసుకొంటాను నేను. అలా కాక అర్థంలో ఏమైనా కొంచెం తేడా ఉందేమో నాకు తెలియదు. కనుకనే అడుగుతున్నా నిన్ను. పృధ గ్వేదితు మిచ్ఛామి - వేర్వేరు అర్థాలుంటే అవేమిటో వాటి స్వరూపం బయటపెట్టు. నీవు హృషీకేశుడవూ కేశి నిషూదనుడవు కనుక శబ్దార్థాల రెండింటి మర్మమూ పరిపూర్ణంగా గ్రహించిన వాడవు. తప్పకుండా చెప్పగల సామర్థ్యం నీకుంది. ఒక్కసారి బాగా ఆ రెండింటి విషయమూ నలగగొట్టి ఇదమిత్థమని బయటపెట్ట మంటాడు అర్జునుడు. అర్జునుడనే అపదేశంతో మనమే అడుగుతున్నామీ ప్రశ్న. మనకే తెలుసుకోవాలని ఉంది. ఇంతెందుకు. మోక్ష సన్న్యాసమని ఇక్కడే అధ్యాయానికి పెట్టిన పేరులోనే సన్న్యాసమనే మాట వినిపిస్తున్నది. ఇక్కడే చరమ శ్లోకంలో పరిత్యజ్య
Page 413