#


Index

మోక్ష సన్న్యాస యోగము

సన్న్యాసం వల్ల. దానికి ముందేమిటి షరతు. శ్రద్ధ. ఎలాటి శ్రద్ధ అది. సాత్త్వికమైనది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానమని గదా మొదటి నుంచీ వినిపిస్తున్న భగవద్వాణి. ఎప్పుడు ప్రారంభమయిందా వాణి. మొట్టమొదటి దైన విషాద యోగంలో. విషాదం కాదు నాకు కావలసింది. విషాదమెలా తొలగిపోతుందని ప్రశ్నించి తెలుసుకొనే శ్రద్ధా భక్తులుండాలి నీకు. ఉంటే ఏమవుతుంది. సద్గురువు నీకు పదేశిస్తాడు మార్గం. ఆత్మానాత్మ వివేచన చేయమని. అదే సాంఖ్యం. శ్రద్ధతో వివేచన చేసి ఆత్మను పట్టుకొంటే అనాత్మ మాత్ర మది గాదా అని ప్రశ్న వస్తుంది. అది జ్ఞానమిది కర్మ అని తేడా చూస్తే ప్రశ్న ప్రశ్న గానే మిగిలిపోతుంది. కాబట్టి జ్ఞానమే ప్రసరిస్తే కర్మ అయిందని కర్మయోగం సమాధానమిస్తుంది.

  అయితే కర్మను అనుష్ఠానంగా గాక యోగంగా మార్చుకొనే శ్రద్ధ ఉండాలి నీకు. ఉంటే అది జ్ఞానం కన్నా వేరుగాదని బోధిస్తుంది నీకు జ్ఞానయోగం. అది పాకానికి వస్తే నీ సాధన మార్గాని కడ్డు వచ్చే శాస్త్రోక్త కర్మలన్నీ సన్న్యసించే ధైర్యముండాలి నీకు. అందులో కూడా శ్రద్ధ ఉంటేనే గాని సాధించలేవు. అప్పుడే అది కర్మసన్న్యాసం. అన్ని కర్మలు గాదు-శాస్త్ర చోదితమైనవే సుమా. ప్రారబ్ధ కర్మ ఎలాగూ ఉంటుంది. అయితే ఎలా సాధించాలది. ఆత్మ సంయమనం ద్వారా. అంటే ప్రాపంచిక విషయాల మీది చాపల్య మరికట్టే మనో నిగ్రహం ద్వారా. అందులో కూడా ఉండాలి నీకు శ్రద్ధ. దీనితో త్వం పదార్ధమైన నీ జీవ భావం శుద్ధి అయింది.

Page 407

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు