ఏమాత్రమూ ఫలితమివ్వదు. నిష్ఫలం. నచ తత్రేత్య నో ఇహ. అది ఇహంలో నీకుపయోగ పడదు. చచ్చిన తరువాత రేపుపరానికీ పనికిరాదు. ఇహపరాలు రెండూ లేవు వాడికి. రెంటికీ చెడ్డరేవడయి పోతాడ శ్రద్ధాళువైన మానవుడు. శ్రద్ధా మయోయం పురుషః అని మొదటనే హెచ్చరించాడు మహర్షి, శ్రద్ధే మానవుడు. శ్రద్ధ లేకుంటే వాడు మానవుడే గాడు. ఒక్క మాటలో ముక్తసరిగా కొట్టేశారు భాష్యకారులు మత్రాప్తి సాధన మార్గ బాహ్యత్వాత్తని. పరమార్ధాన్ని పొందే మార్గంలో నుంచి బహిష్కృతుడట వాడు. మానవ జన్మ వచ్చిందే మనకిచ్చిందే పురుషార్ధాన్ని సాధించటానికి. దానికుండవలసిన షరతు శ్రద్ధ. దానికే నోచుకోక పోతే ఇక పురుషార్ధమేమిటి. సాధన ఏమిటి. జాయస్వమ్రియస్వ అన్నట్టు జనన మరణ పరంపరే చివరకు మిగిలేది. కనుక అజత్వమూ అమరత్వమే సాధించాలంటే మానవుడు ఆది నుంచీ అంతం దాకా శ్రద్ధ నేమరరాదు. అదే గమ్యం చేరేవరకూ తల్లిలాగా మనలను కాపాడుతుంది. కడ తేరుస్తుంది.
ఇతి
శ్రద్ధాత్రయ విభాగ యోగః సమాప్తః