#


Index

శ్రద్ధాత్రయ విభాగ యోగము

  ఇక్కడ దాన క్రియాశ్చ వివిధాః అనేచోట వివిధమైన దానాలేమిటని ప్రశ్న వచ్చింది. దానికి భగవత్పాదు లేమని వ్రాశారంటే దానమనేది ఒకటి గాదు. ఏది ఇచ్చినా అది దానమే. క్షేత్ర హిరణ్య ప్రదానాది లక్షణాః అని ఆయన మాట. అది పొలాలే కావచ్చు. బంగారు నాణాలే కావచ్చు. గోవులూ వస్తు వాహనాదులే కావచ్చు. ఏదైనా దానమే గదా అందుకే వివిధా అన్నారంటా రాయన.

  పోతే ఇక సచ్ఛబ్దాని కెక్కడ వినియోగమో అదీ చెబుతున్నారు.

సద్భావే సాధుభావేచ - సదిత్యేత త్ప్రయుజ్యతే
ప్రశస్తే కర్మణి తధా - సచ్ఛబ్దః పార్ధయుజ్యతే - 26

  సద్భావం సాధు భావమని రెండున్నాయి అర్థాలు. ఈ రెండర్థాలలో దేనిలోనైనా ప్రయోగించవచ్చు సత్తనే మాట. అంతకుముందు లేనిది క్రొత్తగా ఏర్పడితే దానికి సత్తని పేరు. అవిద్య మానస్య పుత్రస్య జన్మని అని వ్రాస్తున్నారు స్వామి వారు. పుత్రుడంతకు ముందు లేడు. ఇప్పుడు జన్మించాడను కొండి. అది సద్భావం Presence. ఇక సాధుభావ మేమిటి. అసాధోః సద్వృత్తతా అంటారాయన. అసాధువయిన మానవుడు సాధు స్వభావుడుగా మారితే అది సాధు భావం. అది మానవుడు చేసే కర్మకు కూడా అన్వయిస్తే అది ప్రశస్తమైన కర్మ అవుతుంది. ఉపనయన వివాహాదులన్నీ ప్రశస్తమని పించుకోవాలంటే సత్పదార్థ ప్రభావమే.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు